వింబుల్డన్‌లో అల్కరాజ్ జోరు.. క్వార్టర్స్‌కు అర్హత

వింబుల్డన్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ ఫేవరెట్ కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగుతోంది.

Update: 2024-07-07 18:02 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్‌ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ ఫేవరెట్ కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగుతోంది. ఈ డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అల్కరాజ్(స్పెయిన్) 6-3, 6-4, 1-6, 7-5 తేడాతో ఫ్రాన్స్ ప్లేయర్ హంబర్ట్‌ను ఓడించాడు. 3 గంటలపాటు సాగిన పోరులో అల్కరాజ్ విజయం కోసం కాస్త శ్రమించాడు. ప్రత్యర్థి హంబర్ట్ పోటీనివ్వడంతో ఫలితం నాలుగో సెట్‌లో తేలింది.

వరుసగా తొలి రెండు సెట్లు నెగ్గిన అల్కరాజ్‌ మూడో సెట్‌నూ నెగ్గి గెలుపు లాంఛనం చేసుకోవాలనుకున్నాడు. అయితే, ఆ సెట్‌లో దూకుడుగా ఆడిన హంబర్ట్.. అల్కరాజ్‌కు షాకిచ్చాడు. అయితే, నాలుగో సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కానీ, అల్కరాజే చివరికి పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 14 ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టిన అల్కరాజ్ ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. హంబర్ ఐదుసార్లే బ్రేక్ పాయింట్ సాధించాడు. అలాగే, టాప్ సీడ్, ఇటలీ ప్లేయర్ సిన్నర్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో సిన్నర్ 6-2, 6-4, 7-6(11-9) తేడాతో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్‌పై విజయం సాధించాడు. షెల్టన్ 4 డబుల్ ఫౌల్ట్స్, 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.


Similar News