వరల్డ్ నం.4కు షాకిచ్చిన ప్రియాన్షు.. కెనడా ఓపెన్‌లో సెమీస్‌కు

భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ అదరగొట్టాడు.

Update: 2024-07-06 12:20 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ అదరగొట్టాడు. కెనడాలో జరుగుతున్న కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 39వ ర్యాంకర్ అయిన రజావత్ వరల్డ్ నం.4 అండర్స్ ఆంటోన్సెన్‌కు షాకిచ్చాడు. గంటా 19 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో 21-11, 17-21, 21-19 తేడాతో రజావత్ విజయం సాధించాడు. మ్యాచ్‌ను దూకుడుగా మొదలుపెట్టిన అతను తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గి శుభారంభం చేశాడు. అయితే, మిగతా రెండు సెట్లలో ప్రత్యర్థి సవాల్ విసిరాడు. రజావత్‌ను నిలువరించి రెండో గేమ్‌ను నెగ్గాడు.

నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లడంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. మూడో గేమ్ కూడా నువ్వానేనా అన్నట్టే సాగింది. మొదటి నుంచి రజావత్ ఆధిక్యం కనబర్చినా ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. 19-19తో స్కోరు సమమైన వేళ రజావత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. టాప్-10లోని ర్యాంకర్‌పై విజయం సాధించడం రజావత్‌కు ఇదే తొలిసారి. సెమీస్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ అలెక్స్ లానియర్‌ను రజావత్ ఎదుర్కోనున్నాడు. మరోవైపు, ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో గాయత్రి జంట 18-21, 21-19, 16-21 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హ్సీ పెయ్ షాన్-హంగ్ ఎన్ ట్జు ద్వయం చేతితో పోరాడి ఓడిపోయింది. 


Similar News