Japan Open: సింధు ఓటమి.. సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ శుభారంభం

డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి నిరాశపర్చింది.

Update: 2023-07-26 13:50 GMT

టోక్యో : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి నిరాశపర్చింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. ఇదే నెలలో జరిగిన కొరియా ఓపెన్‌లో మొదటి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ఆమె.. వరుస టోర్నీలోనూ విఫలమైంది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 12-21, 13-21 తేడాతో చైనా క్రీడాకారిణి జాంగ్ యి మాన్ చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీనివ్వని సింధు 32 నిమిషాల్లోనే మ్యాచ్‌ను కోల్పోయింది. యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ సైతం తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. జపాన్‌కు చెందిన అయా ఓహోరి చేతిలో 21-7, 21-15 తేడాతో ఓడిపోయింది. మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

తొలి రౌండ్‌లో సహచర ఆటగాడు ప్రియాన్ష్ రజావత్‌పై 15-21, 21-12, 22-24 తేడాతో లక్ష్యసేన్ పోరాడి గెలిచాడు. రెండో రౌండ్‌లో జపాన్ ఆటగాడు కాంటా సునేయామతో అతను పోటీపడనున్నాడు. భారత పురుషుల డబుల్స్ స్టార్ జంట సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోరు కొనసాగుతోంది. ఇటీవలే కొరియా ఓపెన్ నెగ్గిన ఈ జోడీ జపాన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో-డేనియల్ మార్టిన్‌పై 16-21, 21-11, 13-21 తేడాతో సాత్విక్ జోడీ విజయం సాధించింది. రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన లాస్సె ముల్హెడే-జెప్పె బే‌తో భారత ద్వయం తలపడనుంది.


Similar News