బుమ్రాతో బీ కేర్ ఫుల్.. జో రూట్‌ను హెచ్చరించిన మైఖేల్ వాన్

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-11 14:50 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదే దూకుడును రూట్ మరికొంతకాలం కొనసాగిస్తే టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అతను బద్దలు కొట్టే అవకాశముంది. ఈ క్రమంలోనే బ్రిటీష్ టీం మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య జరగనున్న ఐదు టెస్టుల గురించి ప్రస్తావించాడు. ఎంత ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన బౌలింగ్‌‌తో రూట్‌ని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే, శ్రీలంకతో జరిగిన 3వ టెస్ట్‌లో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో (13, 12 పరుగులు) చెత్త ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లు రాణించినా ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్ లైనప్‌కు రూట్‌ చాలా ముఖ్యమని మైకేల్ వాన్‌ తెలిపారు.

‘ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు జో రూట్‌ అవసరం ఎంతో ఉంది. అతను రాణించడం ఎంతో కీలకం. మిగతా బ్యాటర్లు అర్ధ శతకాలు చేసినప్పటికీ 4వ స్థానంలో వచ్చి రూట్‌ చేసే భారీ పరుగులే జట్టుకి కీలకం. జో రూట్‌కి బౌలింగ్‌ చేయడానికి బుమ్రా ఇష్టపడతాడు. రాబోయే సిరీస్‌లో అతడు రూట్‌ని మరింత ఇబ్బంది పెట్టొచ్చు. ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్‌ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అక్కడ రూట్‌ ఇప్పటి వరకూ సెంచరీ చేయలేదు. అయితే, రూట్‌ భారీ స్కోర్లు చేయనప్పుడు ఇంగ్లండ్‌ విజయం సాధించే మార్గాలు ఉండాలి. కానీ, వారు అలా చేయట్లేదు’ అని మైకేల్ వాన్‌ చెప్పాడు. ఇదిలాఉండగా, రూట్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. భారత్‌పై 10 శతకాలు, 11 అర్థ శతకాలు సహా 2,846 పరుగులు సాధించాడు.


Similar News