దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా లెజెండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ధోనీ జెర్సీ నంబర్ 7ను ఏ ఇతర ఆటగాళ్లకు ఇవ్వకుండా రిటైర్ చేసింది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవకు గుర్తింపుగా ఏడో నంబర్‌ను ప్రత్యేకంగా ఉంచనుంది. గతంలో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10ని కూడా బీసీసీఐ రిటైర్ చేసిన విషయం తెలిసిందే.
ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీల్లో భారత్‌ను ధోనీ విశ్వవిజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అందుకుంది. మహీ తన కెరీర్‌లో 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో చివరిసారిగా టీమిండియా జెర్సీ ధరించాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.