నవంబర్‌లో సౌతాఫ్రికా, భారత్ తొలి టెస్టు జరగడంపై అనుమానాలు.. కారణం ఏంటంటే?

భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో తొలి టెస్టు జరగనుంది.

Update: 2025-04-04 12:53 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో తొలి టెస్టు జరగనుంది. నవంబర్ 14 నుంచి 18 వరకు మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ టెస్టు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. నవంబర్‌లో ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉండటమే అందుకు కారణం. గతేడాది నవంబర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 999గా నమోదైంది. 400 కంటే ఎక్కువ తీవ్రమైనదిగా పరిగణిస్తారు. అప్పుడు ఢిల్లీలో లాక్‌డౌన్ పరిస్థితులు కనిపించాయి.

ఎమర్జిన్సీ అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. పాఠశాలలు మూసివేశారు. బహిరంగ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. ఈ ఏడాది కూడా నవంబర్‌లో గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే భారత్, సౌతాఫ్రికా సందర్భంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మ్యాచ్‌లపై ప్రభావం చూపింది. 2016లో రెండు రంజీ మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్లేయర్లు తలనొప్పి, కళ్లలో మంటలతో ఇబ్బందిపడ్డారు. 2017 డిసెంబర్‌లో శ్రీలంక ప్లేయర్లు మైదానంలో మాస్క్‌లు ధరించారు. 2019 నవంబర్‌లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు వాంతులు చేసుకున్నారు. ఇక, 2023లో వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు గాలిలో నాణ్యత లోపించడంతో బంగ్లాదేశ్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దుచేసుకుంది.

ప్రతి ఏడాది కాలుష్యం ఉండదు : బీసీసీఐ

నవంబర్‌లో ఢిల్లీ టెస్టు మ్యాచ్ నిర్వహించాలనుకున్న తమ నిర్ణయాన్ని బీసీసీఐ సమర్థించుకుంది. నవంబర్‌లో ఆటకు గాలి కాలుష్యం అంతరాయం కలిగించొచ్చన్న వార్తలను బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ప్రతి ఏడాది కాలుష్యం ఉండదని వ్యాఖ్యానించారు. అందరితో చర్చించాకే, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే రొటేషన్ పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు.


Tags:    

Similar News