టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా హవా.. అక్షర్‌ ఆల్‌రౌండ్ షో..

Update: 2023-03-15 14:25 GMT

దుబాయ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సత్తాచాటిన భారత క్రికెటర్లు ఐసీసీ బుధవారం విడుదల చేసి టెస్టు ర్యాంకింగ్స్‌లో తమ ర్యాంక్‌లను భారీగా మెరుగుపర్చుకున్నారు. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మూడు విభాగాల్లోనూ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. బ్యాటింగ్‌ కేటగిరీలో 8 స్థానాలను వెనక్కినెట్టి 44వ ర్యాంక్‌కు చేరుకోగా.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక, ఆల్‌రౌండర్ విభాగంలో 2 స్థానాలను వెనక్కినెట్టి 4వ ర్యాంక్‌లో నిలిచాడు.

ఆఖరి టెస్టులో భారీ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాలుగో టెస్టులో ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 364 బంతుల్లో 186 పరుగులు చేసి టెస్టుల్లో శతక నిరీక్షణకు తెరదించాడు. ర్యాంకింగ్స్‌లో కోహ్లీ కంటే ముందు రిషబ్ పంత్, రోహిత్ శర్మ వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఆఖరి టెస్టులో సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ ఏకంగా 17 స్థానాలను అధిగమించి 46వ ర్యాంక్‌లో నిలిచాడు. సిరీస్‌లో 25 వికెట్ల తీసిన రవిచంద్రన్ అశ్విన్ నం.1 బౌలర్ పీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

ఇంతకుముందు జేమ్స్‌ అండర్సన్‌ (859)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన అశ్విన్(869) 10 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకుని అండర్స్‌ను వెనక్కినెట్టాడు. బుమ్రా, జడేజా చెరో స్థానం కోల్పోయి 7వ, 9వ ర్యాంక్‌కు పడిపోయారు. ఇక, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ 2వ స్థానంలో ఉండగా.. అక్షర్ పటేల్ 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. దాంతో టాప్-5లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. కాగా, టీమ్ ఇండియా 2-1తో ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం చేసుకోవడంతోపాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News