Asian Games: ఆసియా క్రీడలు.. షూటింగ్‌లో పతకాల పంట

Update: 2023-09-27 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా షూటర్లు అదరగొట్టేస్తున్నారు. షూటింగ్‌లో ఇప్పటికే రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. మహిళల 25 మీటర్ల పిస్టోల్‌ విభాగంలో మను బాకర్, సంగ్వాన్, ఈషా సింగ్‌తో కూడిన బృందం 1,759 పాయింట్లతో గోల్డ్‌ గెలుచుకుంది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌ మహిళల విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా, మనిని కౌషిక్, అషి చౌష్కీ టీమ్‌ 1764 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకుంది. చైనా జట్టు 1,773 పాయింట్లతో గోల్డ్‌ను దక్కించుకుంది.

మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ సమ్రా కౌర్ (469.6 పాయింట్లు) ప్రపంచ రికార్డును నమోదు చేయడంతోపాటు బంగారు పతకం సొంతం చేసుకుంది. చైనాకు చెందిన షూటర్ జంగ్‌ (462.3 పాయింట్లు) రజతం, భారత షూటర్ అషి చౌష్కీ (451.9 పాయింట్లు) కాంస్య పతకాలు సాధించారు. పురుషుల 50 మీటర్ల స్కీట్‌ షూటింగ్‌ విభాగంలోనూ భారత్ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. ఇప్పటి వరకు భారత్‌ పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.


Similar News