ధీరజ్ గురి అదిరింది.. ఆర్చరీ ఆసియా కప్‌లో మూడు స్వర్ణాలు కొల్లగొట్టిన తెలుగు కుర్రాడు
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగిన ఆసియా కప్ ఆర్చరీ లెగ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : ఇరాక్‌లోని బాగ్దాద్‌లో జరిగిన ఆసియా కప్ ఆర్చరీ లెగ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టాడు. ఏకంగా మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టాడు. రికర్వ్ కేటగిరీలో వ్యక్తిగత ఈవెంట్‌తోపాటు పురుషుల, మిక్స్‌డ్ కేటగిరీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. వ్యక్తిగత ఫైనల్‌లో ధీరజ్ 7-3 తేడాతో సహచరుడు తరుణ్‌దీప్ రాయ్‌పై గెలుపొందాడు. అలాగే, పురుషుల టీమ్ విభాగంలో తరుణ్‌దీప్, ప్రవీణ్ రమేశ్‌లతో కలిసి ధీరజ్ విజేతగా నిలిచాడు. ధీరజ్ జట్టు 6-2 తేడాతో బంగ్లాదేశ్ జట్టును ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్, సిమ్రాన్‌జీత్ కౌర్ జోడీ 6-0 తేడాతో బంగ్లాదేశ్‌కు చెందిన దియా సిద్దిక్యూ, సాగోర్ ఇస్లామ్ జంటను చిత్తు చేసింది. అలాగే, 2022లో తల్లి అయిన తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న భారత స్టార్ ఆర్చరీ దీపిక కుమారి సత్తాచాటింది. రికర్వ్ వ్యక్తిగత టైటిల్‌ను సాధించింది. ఫైనల్‌లో ఆమె 6-2 తేడాతో సహచర క్రీడాకారిణి సిమ్రాన్‌జీత్ కౌర్‌పై నెగ్గింది. అలాగే, కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్, మహిళల వ్యక్తిగత విభాగంలో పర్ణీత్ కౌర్ గోల్డ్ మెడల్ సాధించారు. రికర్వ్ మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో సిమ్రాన్‌జీత్ కౌర్, భజన్ కౌర్, దీపిక కుమార్‌లతో కూడిన భారత జట్టు 5-4 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. మొత్తంగా ఈ టోర్నీని భారత ఆర్చరీలు 14 పతకాలతో ముగించారు. అందులో 9 స్వర్ణాలు ఉండగా..నాలుగు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.