Asia Cup 2023: 'జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌కు అసలు పరీక్ష'

ఐర్లాండ్ పర్యటనలో రీఎంట్రీ ఇచ్చిన టీమ్ ఇండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌కు ఆసియా కప్‌ 2023 పరీక్షగా నిలవనుందని పాకిస్థాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు.

Update: 2023-08-28 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్ పర్యటనలో రీఎంట్రీ ఇచ్చిన టీమ్ ఇండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌కు ఆసియా కప్‌ 2023 పరీక్షగా నిలవనుందని పాకిస్థాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్‌లో ఎవరు ఫేవరేట్ అని చెప్పడం కష్టమని.. తమదైన రోజున ప్రతీ జట్టు చెలరేగుతుందన్నాడు. ఆసియాకప్ 2023 టోర్నీకి సంబంధించిన స్పాన్సర్ ఈవెంట్‌లో వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక.. ఇతర జట్ల బౌలర్లు 10 ఓవర్లు వేసే సామర్థ్యంతో ఉన్నారా? లేదా? అన్నది ఆసియా కప్‌ టోర్నీతో తేలిపోతుంది. టీ20ల కారణంగా బౌలర్లందరూ మ్యాచ్‌కు నాలుగు ఓవర్ల చొప్పున వేసేందుకు అలవాటు పడ్డారు. ప్రపంచకప్‌ ముందు 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్‌ నిర్వహించాలనే ఆలోచన మంచిది.

ఇది సుదీర్ఘంగా సాగే టోర్నీ. ఒక్క మ్యాచ్‌ గెలవగానే సెమీస్‌ చేరే ఛాన్స్‌ ఉండదు. ఒక్కో మ్యాచ్‌ ఆడుతూ.. గెలుస్తూ ముందుకు సాగాలి. ఈ సారి టీ20 కాకుండా వన్డే ఫార్మాట్‌‌లో జరగనుంది కాబట్టి అందుకే విభిన్నమైన మానసిక దృక్పథం, ఫిట్‌నెస్‌ అవసరం. గతేడాది భారత్‌, పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరుతాయని ఆశించాం. కానీ శ్రీలంక టైటిల్‌ అందుకుంది. అందుకే ఈ సారి ఏ జట్టూ ఫేవరెట్‌ అని చెప్పలేకపోతున్నాం. భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ప్రమాదకరమే. తమదైన రోజున ఏ జట్టయినా గెలవగలదు. భారత్‌, పాక్‌ పోరుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఎంతోమంది ఆసక్తితో తిలకిస్తారు. కానీ లంక లేదా బంగ్లాను తక్కువ అంచనా వేయలేమని చెప్పుకొచ్చారు.


Similar News