అందనంత ‘ఎత్తు’కు అర్జున్.. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సంచలనాలు

చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించడంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ కీలక పాత్ర పోషించాడు.

Update: 2024-09-23 19:21 GMT

దిశ, స్పోర్ట్స్ : 11 గేముల్లో 9 విజయాలు.. రెండు డ్రాలు.. చెస్ ఒలింపియాడ్‌లో అర్జున్ ఇరిగేశి జైత్రయాత్ర ఇది. ఒక్క గేమ్‌లోనూ ఓటమి పాలవ్వలేదు. భారత్ చారిత్రాత్మక స్వర్ణం సాధించడంలో ఈ తెలంగాణ కుర్రాడిదే కీలక పాత్ర. 8 ఏళ్ల వయసులో చదరంగంలోకి అడుగుపెట్టిన అతను 14 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకుని.. ఇప్పుడు ఆటలో అందనంత ఎత్తుకు ఎదిగాడు.

21 ఏళ్ల అర్జున్ వరంగల్ జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి డాక్టర్. ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉండేవారు. చిన్నప్పటి నుంచే అర్జున్ చురుకుగా ఉండేవాడు. అతనిలోని ప్రతిభ, చురుకుదనం గుర్తించిన స్కూల్ టీచర్ అతనికి చెస్ ఆడాలని సలహా ఇచ్చింది. 8 ఏళ్ల వయసులో అతను ఆటలోకి ప్రవేశించాడు. ఆరంభంలో అక్కతో కలిసి సాధన చేసేవాడు. వరంగల్‌కు తిరిగి వచ్చాక కోచ్ బొల్లం సంపత్ వద్ద బేసిక్స్ నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అతన్ని ప్రోత్సహించేవారు. ప్రత్యేకంగా కోచ్‌ను ఏర్పాటు చేశారు. కోచ్ సుదర్శన్ అర్జున్‌కు కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తుండేవాడు. ఆ తర్వాత అర్జున్ హైదరాబాద్‌కు వచ్చాడు. అక్కడ కోచ్ ఎన్.రామరాజు వద్ద రాటుదేలాడు.

తెలంగాణ నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్‌గా

తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి ఆటగాడు అర్జునే. అతను 14 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాడు. 2018లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత యంగెస్ట్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అక్కడితోనే అతను ఆగలేదు. 2022లో జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశాడు. అర్జున్ పావు కదిపితే ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే. తనకన్నా వయసులో, అనుభవంలో చాలా పెద్ద వాళ్లతో పోటీపడి మరి విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత విభాగంలో అర్జున్ రజతం సాధించాడు. అలాగే, గతేడాది ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కినెట్టి..

అంతర్జాతీయ స్థాయిలో అర్జున్ ఎన్నో టైటిల్స్ గెలిచాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-5లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను 3వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇటీవలే అర్జున్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కినెట్టి భారత అత్యున్నత చెస్ ప్లేయర్‌గా నిలిచాడు. 

Tags:    

Similar News