24 ఏళ్లకే సంచలన నిర్ణయం తీసుకున్న టీటీ క్రీడాకారిణి అర్చనా కామత్

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి అర్చనా కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-22 13:12 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి అర్చనా కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. 24 ఏళ్ల అర్చనా ముందు ఎంతో కెరీర్ ఉండగా ఆటకు గుడ్ బై చెప్పడం గమనార్హం. గురువారం అర్చన తన రిటైర్మెంట్ ప్రకటన చేసింది. హయ్యర్ స్టడీస్‌పై ఫోకస్ పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ‘టేబుల్ టెన్నిస్‌తోపాటు చదవడం కూడా నాకు ఇష్టమే. పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. ఇప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి వేరే హోదాలో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా.’ అని పేర్కొంది.

ఆర్థిక అవసరాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. తనకు అన్ని రకాలుగా మద్దతు లభించిందని, దేశానికి ఆడటం అతిపెద్ద గౌరవమని చెప్పింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో అర్చన పబ్లిక్ పాలసీపై మాస్టర్స్ చేయనుంది. ఎకానమిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె ఇప్పటికే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై మాస్టర్స్ చేసింది. కాగా, ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో అర్చన భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించగా.. భారత జట్టు విజయాల్లో అర్చన కీలక పాత్ర పోషించింది. క్వార్టర్స్‌లో జర్మనీ చేతిలో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోగా.. ఆ మ్యాచ్‌లో భారత్ తరపున గెలిచింది అర్చన మాత్రమే. 

Tags:    

Similar News