Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్..

భారత పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ నియామకమయ్యాడు.

Update: 2023-07-04 16:30 GMT

న్యూఢిల్లీ : భారత పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ నియామకమయ్యాడు. చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ నియామకాన్ని బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. చేతన్ శర్మ రాజీనామా తర్వాత చీఫ్ సెలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు చేపట్టిన బోర్డు.. గత నెలలో దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ దరఖాస్తు చేసుకున్నాడు. టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా పోటీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇంటర్వ్యూకి మాత్రం అగార్కర్ ఒక్కడే హాజరైనట్టు తెలుస్తోంది. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఏకపక్షంగా ఖాళీగా ఉన్న సెలెక్టర్ స్థానానికి అగార్కర్‌ పేరును సిఫార్స్ చేసినట్టు బోర్డు తెలిపింది.

సీఏసీ సిఫార్సుల మేరకు అజిత్ అగార్కర్‌ను సెలెక్షన్ కమిటీలోకి తీసుకున్న బోర్డు.. చీఫ్ సెలెక్టర్‌గా నియమించింది. సెలెక్షన్ కమిటీలో ఎక్కువగా టెస్టులు ఆడింది అగార్కరే కాబట్టి సీనియారిటీ ప్రకారం అతన్ని చైర్మన్‌గా నియమించినట్టు బోర్డు తెలిపింది. చైర్మన్‌గా అజిత్ అగార్కర్, సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లతో సెలెక్షన్ కమిటీ పూర్తిగా భర్తీ అయ్యింది. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన బోర్డు.. ఇంకా టీ20 జట్టును వెల్లడించలేదు. దాంతో అగార్కర్ నేతృత్వంలో టీ20 జట్టు ఎంపికకానుంది. కాగా, మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ టీమ్ ఇండియాకు చాలా కాలంపాటు సేవలందించాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ముంబై సీనియర్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. ఇటీవలే ఆ పదవి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.


Similar News