Disha Special: బ్రాండ్ వాల్యూ కా బాప్ ఐపీఎల్..! బీసీసీఐపై కాసుల వర్షం
మనం ఆడటానికి, చూడటానికి ఎన్నో క్రీడలున్నా.. క్రికెట్ అంటేనే ప్రేమ ఎక్కువ.
దిశ, స్పోర్ట్స్: మనం ఆడటానికి, చూడటానికి ఎన్నో క్రీడలున్నా.. క్రికెట్ అంటేనే ప్రేమ ఎక్కువ. టీవీల్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నా.. క్రికెట్ ఉంటేనే వ్యూవర్‌షిప్ ఎక్కువ. అందుకే ఇండియాలో క్రికెట్ ఒక మతంలా మారిపోయింది. అందుకే క్రికెట్ ఆడే దేశాలు ఎన్ని ఉన్నా బీసీసీఐ మాత్రమే విపరీతంగా డబ్బులు సంపాదిస్తుంది. ప్రపంచంలోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఎదగడానికి కారణం ఇండియాలో క్రికెట్ అంటే ఉన్న విపరీతమైన పిచ్చే. అందుకే ఈ పిచ్చిని పైసల్లా మార్చుకుంటోంది బీసీసీఐ. ఈ క్రమంలో పుట్టిందే ఐపీఎల్. వాస్తవానికి ఐపీఎల్ పుట్టింది బీసీసీఐ మనుగడ కోసమే. కానీ అదే ఆ తర్వాత అదే బీసీసీఐకి కాసుల పంట పండిస్తోంది. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ను బీసీసీఐతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, ఫ్రాంచైజీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఐపీఎల్ అంటేనే ఇండియన్ పైసల లీగ్‌లా మార్చింది అనే అపవాదు కూడా బీసీసీఐపై ఉంది. అయితే, ఈ ఐపీఎల్ ఎలా మొదలైంది? అనేది తెలుసుకుందాం.
ఇప్పుడంటే ఐపీఎల్ బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారింది. అయితే ఈ లీగ్ పుట్టింది డబ్బుల కోసం మాత్రం కాదు. ఇండియాలో బీసీసీఐ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసిన ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)ను ఢీకొట్టడానికే 2008లో ఐపీఎల్‌ను తెరముందుకు తెచ్చింది. 2008లో మొదలైన ఐపీఎల్ అంచెలంచులుగా ఎదిగింది. 17 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నెల 22 నుంచి 18వ సీజన్ మొదలుకానుంది. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వరల్డ్‌లోని టాప్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడటానికి పోటీపడుతుంటారు. జాతీయ జట్టు బాధ్యతలను కూడా పక్కనపెట్టడానికి కూడా వెనకాడరు. అంత క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్ బీసీసీఐపై కనక వర్షం కురిపిస్తోంది. బీసీసీఐ రిచెస్ట్ బోర్డుగా ఎదగడానికి ఐపీఎలే కారణం.
బీసీసీఐని భయపెట్టిన ఐసీఎల్
ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్) 2007లో పురుడు పోసుకుంది. ఐసీఎల్ ఆవిర్భవంలో కీలక పాత్ర పోషించింది జీటీవీ ఓనర్ సుభాష్ చంద్ర. ఐసీఎల్‌ను ప్రారంభించడానికి తెర వెనుక పెద్ద కథే జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇండియాలో టీవీ ప్రసార హక్కుల కోసం అప్పట్లో బీసీసీఐని సుభాష్ చంద్ర సంప్రదించారు. అప్పటికే బీసీసీఐకి టెన్ స్పోర్ట్స్‌తో భాగస్వామ్యం ఉంది. దీంతో జీటీవీ ముందుగానే టెన్ స్పోర్ట్స్‌లో వాటాలు కొన్నది. అంతే కాకుండా క్రికెట్ కోసం జీటీవీ స్పోర్ట్స్ అనే ఛానల్ కూడా ప్రారంభించింది. 2000లో బీసీసీఐ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేసింది. ఆ బిడ్డింగ్‌లో జీటీవీ కొటేషనే ఎక్కువ. కానీ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా జీటీవీకి హక్కులు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత పిలిచిన టెండర్లలో కూడా జీటీవీనే ఎక్కువ కోట్ చేసినా.. దాన్ని తోసిపుచ్చి రెండో స్థానంలో ఉన్న ఈఎస్‌పీఎన్ స్టార్‌కు హక్కులు ఇచ్చింది. బీసీసీఐ క్రికెట్ రైట్స్ విషయంలో తనకు జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకున్న సుభాష్ చంద్ర.. ఏకంగా బీసీసీఐ పునాదులనే కదిలించాలని డిసైడ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో ఐసీఎల్‌ను మొదలు పెట్టాడు. భారత జట్టులో స్థానం దొరకని టాలెంటెడ్ ప్లేయర్లను ఐసీఎల్‌లో చేరడానికి డబ్బులను ఎరగా వేశాడు. ముఖ్యంగా ఐసీఎల్ బాధ్యతలను లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు అప్పగించడం ద్వారా ఐసీఎల్‌కు ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొని వచ్చారు. పైకి కపిల్ దేవ్ మాత్రమే కనపడుతున్నా.. తెర వెనుక బీసీసీఐ ద్వారా అప్పట్లో బాధించబడిన సునీల్ గవాస్కర్, అజారుద్దీన్ వంటి క్రికెటర్లు కూడా ఇందుకోసం పని చేశారన్న ప్రచారం జరిగింది. మూడు సీజన్లపాటు విజయవంతంగా సాగిన ఈ లీగ్.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలకు చెందిన కీలకమైన క్రికెటర్లను తనవైపు లాగేసుకుంది. ఏడు ఇండియన్ జట్లు, ఒక పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ జట్టుతో టీ20 ఫార్మాట్‌లో లీగ్ మొదలైంది. అప్పటి స్టార్ క్రికెటర్లు ఇంజమామ్ ఉల్ హక్, అంబటి రాయుడు, రోహన్ గవాస్కర్, స్టువర్ బిన్నీ, అజార్ మహమూద్, ఇమ్రాన్ నజీర్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగస్వామ్యమయ్యారు. దీంతో బీసీసీఐతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వణికి పోయింది.
లలిత్ మోడీ ఎంట్రీ
ఐసీఎల్ సూపర్ హిట్ అయ్యింది. క్రికెట్ ప్రేమికులకు టీ20 ఫార్మాట్‌లో మూడు దేశాల క్రికెటర్లు ఒకే జట్టులో కలిసి ఆడటం సరికొత్త అనుభూతిని ఇచ్చింది. పైగా తమ నగరాల పేరుతోనే క్రికెట్ టీమ్స్ పేర్లు ఉండటంతో స్థానిక ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో బీసీసీఐ ఒక్కసారిగా డైలమాలో పడింది. ఐసీఎల్‌కు దీటుగా మరో లీగ్‌ను ప్రారంభించకపోతే బీసీసీఐ మనుగడే ప్రమాదంలో పడుతుందని భయపడింది. దీంతో ఇలాంటి లీగ్స్‌ను నడిపించగలిగే సత్తా ఉన్న లలిత్ మోడీని ఇండియాకు రప్పించింది. అన్ని దేశాల క్రికెటర్లతో 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌లో లీగ్‌ను ప్రారంభించాలని 1995లో లలిత్ మోడీ బీసీసీఐ ముందు ప్రతిపాదించాడు. బీసీసీఐ అప్పట్లో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఎల్ వచ్చిన తర్వాత బీసీసీఐకి లలిత్ మోడీ గుర్తుకు వచ్చాడు. వెంటనే అతడిని రంగంలోకి దింపింది. మొదట్లోనే ఈ లీగ్‌ను బంగారు బాతుగా అభివర్ణించిన లలిత మోడీ.. ఐపీఎల్ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్‌ను ఏలబోతుందని చెప్పాడు.
భారత క్రికెట్‌లో కొత్త శకం
లలిత్ మోడీ బీసీసీఐ ఊహించిన దానికంటే భారీగా ఐపీఎల్‌ను మొదలు పెట్టాడు.ఇందుకు యూరోపియన్ ప్రీమియర్ లీగ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. లలిత్ మోడీ రూపొందించిన లీగ్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపడంతో భారత క్రికెట్ రంగంలో కొత్త శకం మొదలైంది. 2008లో 8 జట్లతో ఐపీఎల్ మొదలైంది. ఎనిమిది ఫ్రాంచైజీలను బీసీసీఐ.. రిలయన్స్, ఇండియా సిమెంట్స్, డెక్కన్ క్రానికల్, జీఎంఆర్, యునైటెడ్ స్పిరిట్స్ వంటి బడా కంపెనీలతో పాటు షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ యాక్టర్లకు అమ్మేసింది. ఐపీఎల్ చైర్మన్ అండ్ కమిషనర్‌గా లలిత్ మోడీ రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగాడు. లలిత్ మోడీ స్ట్రాటజీలకు, బీసీసీఐ వేసిన ఎత్తుగడలకు ఐసీఎల్ మొత్తానికే మూసుకుంది.మొదటి సీజన్‌తోనే ఐపీఎల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రపంచ క్రికెట్‌లో ఇదొక మైలు రాయిగా మిగిలిపోయింది.
సెకండ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్
బీసీసీఐ మనుగడ కోసం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పరిణామ క్రమంలో ఇండియన్ పైసల లీగ్ మారింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 12 బిలియన్ డాలర్లు. ఇది 2024 కంటే 13 శాతం ఎక్కువ. దీంతో ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ అవతరించింది. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్‌ఎఫ్‌ఎల్, 20 బిలియన్ డాలర్లు) మొదటి స్థానంలో ఉన్నది. 2022లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల ద్వారా బీసీసీఐ ఖాతాలో రూ.48,390 కోట్లు చేరాయి. శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా రూ.23,575 కోట్లకు కొనుగోలు చేయగా.. డిజిటల్ రైట్స్‌ను వయాకామ్ 18 రూ.23,758 కోట్లకు దక్కించుకుంది. స్టార్ ఇండియా ఒక్కో మ్యాచ్‌కు రూ.57.40 కోట్లు చెల్లిస్తుండగా.. జియో సినిమా ఒక్కో మ్యాచ్‌కు రూ.50 కోట్లు చెల్లిస్తోంది. అంటే మొత్తంగా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్ ద్వారా రూ.107.40 కోట్లు సమకూరుతుంది. ఐపీఎల్ స్పాన్సర్ టాటా రూ.2,500 కోట్లు (2024-2028) వెచ్చిస్తున్నది. ఐపీఎల్‌లో యాడ్స్ కూడా చాలా ఖరీదుగా మారాయి. టీవీలో 10 సెకెన్ల యాడ్ కోసం దాదాపు రూ.18 లక్షలు,స్ట్రీమింగ్ యాప్ యాడ్ కోసం 10 సెకెన్లకు రూ.7.5 లక్షలుగా ఉన్నాయి.
ఐపీఎల్.. కొన్ని లెక్కలు..
- ఐపీఎల్ ప్రస్తుత బ్రాండ్ వాల్యూ 12 బిలియన్ డాలర్లు. ఇది 2024 కంటే 13 శాతం ఎక్కువ.
- ఐపీఎల్ టీమ్ ప్రస్తుత పర్స్ వాల్యూ రూ.120 కోట్లు
- ప్రతీ టీమ్ రూ.650 కోట్లు ఖర్చు చేసే వీలుంది.
- ఐపీఎల్ స్పాన్సర్ టాటా వెచ్చిస్తున్న డబ్బు రూ.2,500 కోట్లు (2024-2028)
- గతంలో వీవో ఏడాదికి రూ.484 కోట్లు ఇచ్చింది.
- ఐపీఎల్ బెట్టింగ్స్ సమయంలో అత్యధిక డబ్బులు పెట్టేది సీఎస్కే, ముంబై, కోల్‌కతా జట్లపైనే..
- ముంబై టీమ్ ఓనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్.. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజరస్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌కు కో-స్పాన్సర్‌గా ఉంది.
- ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు వయాకామ్18, స్టార్ స్పోర్ట్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వయాకామ్, స్టార్ కలిసి పోవడంతో జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ఐపీఎల్‌లో యాడ్స్ కూడా చాలా ఖరీదుగా మారాయి. టీవీలో 10 సెకెన్ల యాడ్ రూ.18 లక్షలు.. డిజిటల్ యాడ్ (CPM- ప్రతీ వెయ్యి ఇంప్రెషన్స్‌కు) రూ.340 నుంచి రూ.650.. స్ట్రీమింగ్ యాప్ యాడ్ 10 సెకెన్లకు రూ.7.5 లక్షలు
- ప్రస్తుతం బీసీసీఐ రిజర్వ్ నిధులు రూ.20,686 కోట్లు.. 2020లో రూ. 5,526 కోట్లు