మీతో కలిసి పనిచేస్తాం -సోనియా గాంధీ
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డెమొక్రాట్ అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్‌లపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు కురుస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం బైడెన్, హారిస్‌లకు ఎన్నికల్లో విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ యోచిస్తున్నదని తెలిపారు. లింగం, జాతి విభజనకు అడ్డుకట్ట వేసి, సమానత్వానికి దారి చూపించేలా ప్రచారంలో బైడెన్ చేసిన ప్రసంగాలను కొనియాడారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, సాంకేతికత, రక్షణపరంగా […]
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డెమొక్రాట్ అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్‌లపై ప్రపంచవ్యాప్తంగా అభినందనలు కురుస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం బైడెన్, హారిస్‌లకు ఎన్నికల్లో విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ యోచిస్తున్నదని తెలిపారు.
లింగం, జాతి విభజనకు అడ్డుకట్ట వేసి, సమానత్వానికి దారి చూపించేలా ప్రచారంలో బైడెన్ చేసిన ప్రసంగాలను కొనియాడారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, సాంకేతికత, రక్షణపరంగా సహకారం ఉభయ దేశాల బంధాన్ని పటిష్టం చేసిందని, బైడెన్ నాయకత్వంలో ఈ స్నేహం మరింత చిక్కనవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవలి దశాబ్దాల్లో సాగిన అమెరికా, ఇండియా మైత్రి నిరాటంకంగా కొనసాగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, జాతి, లింగ సమానత్వ విలువలను కమలా హారిస్ గెలిపించారని అభివర్ణించారు. విభజించబడిన దేశాన్ని హారిస్ మళ్లీ ఏకం చేస్తారన్న విశ్వాసమున్నదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు, మానవ హక్కులకు మద్దతునిస్తున్నట్టే భారత్‌తోనూ పటిష్ట సంబంధాలు నెరపుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రెండు ప్రజాస్వామిక దేశాలు మరింత చేరువవ్వడానికి వారితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.