కొందరు రిబ్బన్ కటింగ్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు: ప్రధాని మోడీ
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ పై తీవ్రవిమర్శలు చేశారు. కొందరు కేవలం ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం పూర్తి చేయడానికే ప్రాధాన్యతనిస్తుందని నొక్కి చెప్పారు. స్థానిక నదులను అనుసంధానం చేస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు కెనాల్ జాతీయ ప్రాజెక్టును ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఢిల్లీ నుంచి బయలుదేరాక, ఒక వ్యక్తి ఆ ప్రాజెక్టుకు […]
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ పై తీవ్రవిమర్శలు చేశారు. కొందరు కేవలం ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం పూర్తి చేయడానికే ప్రాధాన్యతనిస్తుందని నొక్కి చెప్పారు. స్థానిక నదులను అనుసంధానం చేస్తూ రూ.9,800 కోట్లతో నిర్మించిన సరయు కెనాల్ జాతీయ ప్రాజెక్టును ప్రధాని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఢిల్లీ నుంచి బయలుదేరాక, ఒక వ్యక్తి ఆ ప్రాజెక్టుకు తానే రిబ్బన్ కటింగ్ చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టును ప్రారంభించానని కూడా ఆయన చెప్పగలడు. కొందరికి ఇది అలవాటుగా మారింది’ అని అన్నారు. గత ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో చూశానని అన్నారు. ఈ సుదీర్ఘ కాలంలో దేశ వనరులు, సమయం, డబ్బులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో ఎందుకు తొందరపడాలనే తత్వమే దేశ అభివృద్ధికి అతిపెద్ద విరోధంగా మారిందన్నారు. ‘దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత పూర్తైంది. ప్రాజెక్టు మొదటి అంచనా వ్యయం రూ.100 కోట్లని ప్రతి పౌరుడికి తెలుసన్నారు. 50 ఏళ్ల కిందట చేయాలనుకున్నా పనులను కేవలం ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసింది’ అని చెప్పారు. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రస్తుతం రూ.9800 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు.
దేశమంతా సైనికుల అండ…
ఈ సందర్భంగా దివంగత మాజీ త్రివిధ దళపతి బిపిన్ సింగ్ రావత్‌ను ఆయన గుర్తు చేశారు. రావత్‌ను ప్రేమించే వారికి ఆయనను కోల్పోవడం కష్టమైన విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో దేశాభివృద్ధిని ఆయన పైనుంచి చూస్తారని తెలిపారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను రక్షించేందుకు డాక్టర్లు శక్తిమేరా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తాను కూడా వరుణ్ కోలుకోవాలని భగవంతుడిని కోరినట్లు చెప్పారు. దేశం మొత్తం రావత్‌తో పాటు మరణించిన సైనిక కుటుంబాలకు మద్దతుగా ఉందని అన్నారు. యోగీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నేరస్తుల సంఖ్య తగ్గిపోయిందన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు పేద, దళిత, వెనుకబడిన, ఆదివాసీ తరగతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.