హుజూరాబాద్‌లో అభ్యర్థి గెలుపును ఆ ఓట్లు శాసించేనా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అత్యంత కీలకంగా భావిస్తున్న సైలెంట్ ఓట్లు గెలుపోటములను శాసిస్తాయా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మోహమాటంగా తమ ఓటు ఎటువైపో అని చెప్పిన ఓటర్లు కాకుండా తమ నిర్ణయాన్ని బయటకు వెల్లడించని ఓటర్లే అత్యంత కీలకంగా మారారు. వీరు ఏ పార్టీవైపు మొగ్గు చూపారన్నదే పజిల్‌గా మారింది. 10 నుండి 12 శాతం మంది ఓటర్లు తాము ఎవరి పక్షాన నిలబడ్డమో చెప్పాడానికి నిరాకరించారు. వీరు కారుకు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అత్యంత కీలకంగా భావిస్తున్న సైలెంట్ ఓట్లు గెలుపోటములను శాసిస్తాయా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మోహమాటంగా తమ ఓటు ఎటువైపో అని చెప్పిన ఓటర్లు కాకుండా తమ నిర్ణయాన్ని బయటకు వెల్లడించని ఓటర్లే అత్యంత కీలకంగా మారారు. వీరు ఏ పార్టీవైపు మొగ్గు చూపారన్నదే పజిల్‌గా మారింది. 10 నుండి 12 శాతం మంది ఓటర్లు తాము ఎవరి పక్షాన నిలబడ్డమో చెప్పాడానికి నిరాకరించారు. వీరు కారుకు వేశారా లేక కమలానికా అన్నదే అంతు చిక్కకుండా తయారైంది. బాసటగా నిలిచిన వారు ఖచ్చితంగా గెలుపును అందుకుంటారన్న భావన వ్యక్తం అవుతోంది.
చివరి మూడు రోజులు..
పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుండి ఓటర్లు నిశ్శబ్దంగా ఉండడానికే ప్రాదాన్యం ఇచ్చారు. పోలింగ్ రోజున కూడా తమ మదిలో మాటను బయటకు వెల్లడించలేదు. తొలి రెండు గంటల్లో బీజేపీకి అనుకూలమని ప్రచారం జరిగింది. మధ్యాహ్నం కల్లా కారుకే అనుకూలమన్న వాదనలు వినిపించాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా పబ్లిక్ పల్స్ సేకరించామని, కారు స్పీడందుకుంది అన్న విషయాన్ని గుర్తించాయి. నిఘా వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఆ తరువాత అంతా సీన్ ఉల్టా పల్టా అన్నట్టుగా మారింది.
కారు మీద పువ్వు..
కొంతమంది ఓటర్లు లాజిక్‌గా చెప్పుకున్నారని తెలుస్తోంది. కారు మీద పువ్వు అంటూ తమ నివాస ప్రాంతాల్లోకి వెళ్లిన తరువాత చెప్పుకోవడంతో ఈటలకు కూడా అనుకూలమైన వాతావరణం వచ్చిందని గుర్తించారు. అప్పటి వరకు టీఆర్‌ఎస్ 15 నుంచి 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని భావించిన వారు ఓటర్లు అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు బయటకు రావడంతో సీన్ అంతా మారిపోయినట్టుగా అనిపించింది.
చివరి గంటే కీలకం..
పోలింగ్ ప్రక్రియలో చివరి గంటలో వచ్చిన ఓటర్లు కూడా ఎటువైపు మొగ్గు చూపారన్నది కూడా తేలాల్సి ఉంది. సాయంత్రం వేళల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే వారంతా కూడా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉంటారు. వీరి నిర్ణయం కూడా గెలుపోటములను శాసించే అవకాశం లేకపోలేదు. అయితే వీరంతా కూడా ఎటు వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయంపై క్లారిటీ వస్తే విజయం ఎవరిని వరిస్తుందో కూడా అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. 86.64 శాతం పోలింగ్ పర్సంటేజీ నమోదు అయింది. మొత్తంగా 2,05236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టీఆర్ఎస్ అంచనాలివి..
టీఆర్ఎస్ అంచనాల వెనక ఆంతర్యం కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఆసరా పెన్షన్లు, సంక్షేమ పథకాలు, దళితబంధు స్కీం ద్వారా 60 నుంచి 70 వేల ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే స్థానికంగా జరిగిన ప్రచారం ఓటర్లను ప్రభావితం చేసిన తీరుతో 25 వేల నుండి 30 వేల వరకు ఓట్లు టీఆర్ఎస్‌కు పడతాయని భావిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువ శాతం టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా లక్ష వరకు ఓట్లు వస్తాయన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ఓట్లలో 8 నుండి 12 శాతం కాంగ్రెస్ పార్టీకి వస్తాయని భావిస్తున్నారు. ఏది ఎటువైపు వెళ్లినా 1500 నుండి 2 వేల మెజార్టీ వస్తుందన్న ధీమా వ్యక్తం అవుతోంది.
సీక్రెట్ ఆపరేషన్..
గత మూడు నెలలుగా టీఆర్ఎస్ పార్టీ సీక్రెట్ ఆపరేషన్ కూడా నిర్వహించింది. ప్రతి పది మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీని నియమించి వారి బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించింది. ఈ పది మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌కు వేసే బాధ్యతను ఇన్‌చార్జీలు తీసుకున్నట్టు సమాచారం. వీరి అంచనాల ప్రకారం పది మంది ఓటర్ల సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. వీరు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి తీరుతారన్న ధీమా సీఎం వ్యక్తం చేయడానికి కారణం ఇదేనని తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తించి వారిని ఇక్కడకు రప్పించేందుకు కూడా ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లో స్థానికంగా ఉండని వారందరూ తమకే ఓట్లు వేస్తారన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
స్పెషల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్..
మరో వైపున స్పెషల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ కూడా గ్రౌండ్ రియాల్టి తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. అత్యంత రహస్యంగా తిరిగిన ఈ టీం నియోజకవర్గం అంతటా తిరుగుతూ పబ్లిక్ పల్స్ దొరకబట్టుకున్నట్టు సమాచారం. నలుగురు అధికారుల బృందం మెజార్టీ ప్రాంతాల్లో తిరిగి ఓటర్ల నుండి వివరాలు సేకరించి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికలు పంపించినట్టుగా సమాచారం. ఈ నివేదికతోనే సీఎం కేసీఆర్ గెలుపు ధీమాతో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
బలమే బాసట..
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు నియోజకవర్గంలో ఉన్న బలమే బాసటగా నిలుస్తోందన్న అంచనాతో ఉన్నారు. 17 ఏళ్లుగా ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించి ప్రజలతో మమేకం అయినందున ఇక్కడి ఓటర్లు ఖచ్చితంగా తనకు అండగా నిలుస్తారని భావిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నమని చెప్పేందుకు నిరాకరించిన చాలా మంది సీక్రెట్‌గా బీజేపీకే అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో 10 నుండి 12 వేల ఓట్ల మెజారిటీ వస్తుందన్న అంచనాల్లో ఉన్నారు. ఈ సైలెంట్ ఓటింగ్ ప్రభంజనంలా పడితే మాత్రం మెజార్టీ మరింత ఎక్కువే వస్తుందని భావిస్తున్నారు. పోలింగ్‌కు చివరి మూడు రోజుల్లో చాలా మంది స్థానిక నేతలు ఈటలకు అనుకూలంగా ప్రచారం చేశారన్న ఫీడ్ బ్యాక్ రావడంతో బీజేపీ శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోంది. కొన్ని చోట్ల పోలింగ్‌కు ముందు రోజు వరకు టీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రచారం చేసిన వారు కూడా శనివారం రోజు జై బీజేపీ, జై ఈటల అని నినదించారు. ఇలాంటి ప్రచారం కూడా బీజేపీకే సానుకూలత అని అంచనా వేస్తున్నారు.