ఊపు తగ్గిందా..? షర్మిల పార్టీ ప్రకటన వర్చువల్ గానే..!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరించారు. అయితే తన దూకుడుకు కొవిడ్ మహమ్మారి రూపంలో బ్రేక్ పడినట్లయింది. జూలై 8వ తేదీన తన తండ్రి జయంతిని పురస్కరించుకొని పార్టీ ఏర్పాటుచేసి పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించనుంది. తొలుత పార్టీ ప్రకటన కోసం పరేడ్ గ్రౌండ్‌లో లేదా ఎల్బీ స్టేడియంలో భారీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరించారు. అయితే తన దూకుడుకు కొవిడ్ మహమ్మారి రూపంలో బ్రేక్ పడినట్లయింది. జూలై 8వ తేదీన తన తండ్రి జయంతిని పురస్కరించుకొని పార్టీ ఏర్పాటుచేసి పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించనుంది. తొలుత పార్టీ ప్రకటన కోసం పరేడ్ గ్రౌండ్‌లో లేదా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అట్టహాసంగా ఏర్పాట్లు చేయాలని షర్మిల భావించింది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు. వర్చువల్ గానే పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాను ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
లోటస్ పాండ్ నుంచే.. దిశా నిర్దేశం
వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీ జెండా, ఎజెండాను లోటస్ పాండ్ నుంచే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వైఎస్సార్ అభిమానులు, నాయకులకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. తన జెండా, ఎజెండాను జూలై 8వ తేదీన ప్రజల ముందుకు తీసుకొచ్చి తెలంగాణపై తన వైఖరిని వివరించి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. తను తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటోంది అనే అంశాలను సైతం ప్రస్తావించనుంది. అయితే కొవిడ్ సమయంలో హంగామా చేయడం ఇష్టంలేకనే వైఎస్ షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తొలుత బహిరంగ సభ నిర్వహించి లక్షన్నర మంది నుంచి రెండు లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి వేడుకగా పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావించినా ఇప్పుడది వర్కవుట్ అయ్యేలా లేదని వర్చువల్ మీటింగ్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొవిడ్ కారణంగా వైఎస్సార్ అభిమాని ఒకరు మరణించిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని కూడా ఆమె వర్చువల్ మీటింగ్‌కే మొగ్గు చూపినట్లు సమాచారం.
నేతల అసంతృప్తి
రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో(17) స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ జెండా, ఎజెండాను వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రకటనకు బహిరంగ సభ లేకపోవడంతో నేతలంతా ఒకింత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీని గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వర్చువల్ మీటింగ్ వల్ల అయ్యే పని కాదని వారు భావిస్తున్నారు. అయితే అధిష్టానం నిర్ణయం వల్ల బయటకు చెప్పలేకపోతున్నట్లుగా వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రారంభంలో హంగామా చేసి ఇప్పుడు అంతంత మాత్రంగానే నిర్వహిస్తారని చెప్పడంపై వారు కొంత నిరుత్సాహానికి గురైనట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ ప్రకటన నాటి నుంచి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో కీలక నేతలెవరూ ఆమె పార్టీలోకి చేరకపోవడంపై కూడా పలువురు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పుకోదగిన స్థాయి నేతలుంటే కానీ జనాకర్షణ చేయడం కష్టమేనని పలువురు నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ప్రాధాన్యత దక్కకపోవడంపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కేటీ నర్సింహా రెడ్డి అనే నాయకుడు సన్నాహక కమిటీలకు రాజీనామా చేస్తానని చెప్పింది తెలిసిందే.
ఇటీవల రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించాక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ గడప తొక్కేది లేదని స్పష్టం చేశారు. దీంతో షర్మిల పార్టీ నేతలు చేరికకు సంబంధించిన అంశమై ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో అనుకున్న స్థాయిలో స్పందనలేకపోవడంతో నాయకులు డీలా పడినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదు. ఈ విషయంపై కూడా వైఎస్ షర్మిల అధికార పార్టీ నేతలు ఇంకెన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటారో చూస్తామని ఒక సందర్భంలో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటనల్లో కూడా జనాదరణ అంతంతమాత్రమే వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ తగ్గినట్లు తెలుస్తోంది.
నేడు ‘టీమ్ వైఎస్ఎస్సార్’ వెబ్ సైట్ ప్రారంభం
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ షర్మిల ‘టీమ్ వైఎస్ఎస్సార్’ పేరిట రెండు వెబ్ సైట్లను బుధవారం ఉదయం 10 గంటలకు లోటస్ పాండ్ లో ప్రారంభించనున్నారు. లోకల్, ఎన్నారైల కోసం తమ అప్ డేట్స్ ను ఈ వెబ్ సైట్ల ద్వారా అందించనున్నారు. సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకునేందుకు ఆమె ఇదే దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే www.teamyssr.com, www.teamyssr.com/NRI వెబ్‌సైట్లను రూపొందించినట్లుగా లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి.