మురుగు వాసన.. హుస్సేన్‌సాగర్‌కొస్తే ఊపిరాడటం లేదు..!

దిశ, తెలంగాణ బ్యూరో: సాగరం దుర్గంధం వెదజల్లుతోంది. స్ట్రెస్ లైఫ్ లో కాస్తా రిలాక్స్ అవుదామని వస్తున్న ప్రజల ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఆహ్లాదకర వాతావరణం ఆహ్వానిస్తుందనుకుంటే.. మురుగు వాసన పరుగులు పెట్టిస్తోంది. ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నా.. అసలు సమస్య అయిన కంపును వదిలించే పనిలో నిర్లక్ష్యం చేస్తోంది. హుస్సాన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ పూర్తి చేయలేదు. వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఏ […]

Update: 2021-03-01 12:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సాగరం దుర్గంధం వెదజల్లుతోంది. స్ట్రెస్ లైఫ్ లో కాస్తా రిలాక్స్ అవుదామని వస్తున్న ప్రజల ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఆహ్లాదకర వాతావరణం ఆహ్వానిస్తుందనుకుంటే.. మురుగు వాసన పరుగులు పెట్టిస్తోంది. ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నా.. అసలు సమస్య అయిన కంపును వదిలించే పనిలో నిర్లక్ష్యం చేస్తోంది. హుస్సాన్ సాగర్ ను ప్రక్షాళన చేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ పూర్తి చేయలేదు. వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఏ మాత్రం పురోగతి లేకుండా పోయింది. హెచ్ఎమ్డీఏ పరిధిలో ప్రక్షాళన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సాగర్ ని క్లీన్ చేసేందుకు దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పద్ధతులను వాడారు. అందులో ఆస్ట్రీయా మోడ‌ల్, లెజ‌ర్ క్లీనింగ్, గ్లోబ‌ల్ ట్రీట్మెంట్ లాంటి ప్రయోగాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇన్ని ప్రయోగాల ఫలితంగా కొంత మార్పు కూడా కనిపించకపోవడం గమనార్హం.

మెయింటనెన్స్ పేరుతో లక్షల్లో ఖర్చు

హుస్సేన్ సాగర్ క్లీనింగ్ మెయింటనెన్స్ కోసం హెచ్ఎండీఏ నెలకు కొన్ని లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ సాగర్ నీటిలో మార్పు ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం సాగర్ ప్రక్షాళన కోసం ప్రభుత్వం జపాన్ నుంచి రూ.360 కోట్లు అప్పు తెచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు వంతులు హెచ్ఎండీఏ ఖర్చు చేసింది. దీనితో పాటు గతంలో రాష్ర్ట ప్రభుత్వం వంద కోట్ల నిధులు కేటాయించింది. నిధులన్నీ నీళ్ల పాలవుతున్నా సాగర్ ప్రక్షాళన మాత్రం ముందుకుసాగడం లేదు. కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయే తప్పా.. సాగర్ దుర్గంధం మాత్రం వీడడం లేదు. సాగర్ లో నిత్యం కలుషిత నీరు చేరుతూనే ఉంటుంది. ఎక్కువగా పారిశ్రామిక వ్యర్థ జలాలు వచ్చి చేరుతుంటాయి. దీంతో హుస్సేన్ సాగర్ విషపూరితంగా మారింది. సాగర్ లో రోజూ 450 నుంచి 500 ఎంఎల్‌డీల సివరేజ్ వ్యర్థాలు కలుస్తున్నాయి. ఇందులో కేవలం కూక‌ట్ ప‌ల్లి నాలా నుంచే దాదాపు 350 ఎంఎల్‌డీల వ్యర్థాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో సాగ‌ర్ లోని నీరు ఇలా పూర్తిగా ర‌సాయ‌న వ‌్యర్థాల రూపంలోకి మారిపోయింది. ముందుగా సాగర్ లోకి వచ్చే మురుగు నీటి ప్రవాహాన్ని నిలిపి వేసి.. ప్రస్తుతం ఉన్న నీటిని ఖాళీ చేసి శుద్ధి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతంత మాత్రంగా ఎస్టీపీల నిర్వహణ

నగరంలో ఏర్పడే మురుగంతా నేరుగా హుస్సేన్ సాగర్ లో చేరుతుంది. దీంతో నీటిని శుద్ధి చేసేలా నగరం చుట్టూ కొన్ని ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు) లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మెరుగైన ఫలితం కనిపించకపోవడంతో ప్రభుత్వం మరో 11 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా చేయడం ద్వారా సాగర్ నీటిలో కొంతమేర మార్పు కనిపిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఎస్టీపీల్లో చాలా రోజులుగా నీటిని శుద్ధి చేయడం లేదు. తద్వారా అక్కడి పరిసర ప్రాంతాల్లో కలుషిత వాతావరణం ఏర్పడుతోంది. నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో నిలుచునేందుకే వీలు లేకుండా దుర్వాసన వెదజల్లుతోంది.

Tags:    

Similar News