ఆర్‌బీఐ ప్రకటనలతో మార్కెట్లు బేజార్!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీ స్టాక్ మార్కెట్లు మూడు రోజులు కొనసాగించిన హ్యాట్రిక్ లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశ పరిణామాలతో సూచీలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం, రెపో రేట్ల తగ్గింపు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల, రెపో రేటు కోత, మారటోరియం పొడిగింపుతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగి బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు భారీగా నష్టాలను చవిచూశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి […]
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీ స్టాక్ మార్కెట్లు మూడు రోజులు కొనసాగించిన హ్యాట్రిక్ లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశ పరిణామాలతో సూచీలపై తీవ్ర ప్రభావం కనిపించింది. ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం, రెపో రేట్ల తగ్గింపు మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల, రెపో రేటు కోత, మారటోరియం పొడిగింపుతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగి బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు భారీగా నష్టాలను చవిచూశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 260.31 పాయింట్లు కోల్పోయి 30,672 వద్ద ముగియగా, నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 9,039 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ 2.4 – 1.2 శాతం మధ్య పడిపోయాయి. అయితే.. ఐటీ, మీడియా, ఫార్మా రంగాల షేర్లు 2 – 0.7 శాతం మధ్య పుంజుకున్నాయి.
బలహీన పడ్డ రూపాయి..
ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చర్యల వల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనమవడంతో దేశీయ కరెన్సీ రూపాయి కుప్పకూలింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 34 పైసలు క్షీణించి రూ.75.95 వద్ద ఉంది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగినట్లుగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రూ.75.72 వద్ద బలహీనంగా మొదలైనప్పటికీ అనంతరం మరింత క్షీణించి చివరికి రూ. 75.95 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల బలహీనతకు తోడు, అమెరికా డాలరు బలం, దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, అమెరికా – చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రభావాన్ని చూపాయని ట్రేడర్లు చెప్పారు.
మార్కెట్ వర్గాల్లో నిరుత్సాహం..
ఆర్‌బీఐ రెపో కట్ ఫారెక్స్ వ్యాపారులను ఉత్సాహపరచలేదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ చెప్పారు. 40 పాయింట్ల రేట్ కట్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప‍్పటికీ, రుణాల పూర్తి స్థాయి పునర్నిర్మాణాన్ని అందించలేదని, అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ అంచనాలను వెల్లడించకపోవడం కూడా ఈ పరిణామాలకు దారితీసినట్లు చెప్పారు.