కీలక రంగాల మద్దతుతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల తర్వాత లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, మెటల్ రంగాల షేర్లు బలమైన కొనుగోళ్లను సాధించడంతో మంగళవారం సూచీలు బలంగా పుంజుకున్నాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ ఉండొచ్చని ఆందోళనల మధ్య సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన తర్వాత కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మిడ్-సెషన్ వరకు ఆటుపోట్లకు గురయ్యాయి. అనంతరం ర్యాలీ చేసిన […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల తర్వాత లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, మెటల్ రంగాల షేర్లు బలమైన కొనుగోళ్లను సాధించడంతో మంగళవారం సూచీలు బలంగా పుంజుకున్నాయి. కరోనా ప్రభావం, లాక్‌డౌన్ ఉండొచ్చని ఆందోళనల మధ్య సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన తర్వాత కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మిడ్-సెషన్ వరకు ఆటుపోట్లకు గురయ్యాయి. అనంతరం ర్యాలీ చేసిన సూచీలు చివరికి అధిక లాభాలు సాధించాయి. దేశంలో వ్యాక్సిన్ కొరతకు తగిన పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మార్కెట్లలో సానుకూలతను పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆమోదం అందుకున్న వ్యాక్సిన్‌లకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయం పెట్టుబడిదారులు కలిసొచ్చిందని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 660.68 పాయింట్లు ఎగసి 48,544 వద్ద ముగియగా, నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 14,504 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం లాభాలను సాధించగా, ఆటో, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ ఇండెక్స్‌లు 3-4 శాతం మధ్య బలపడ్డాయి. ఐటీ, ఫార్మా సూచీలు నీరసించాయి. సోమవారం టీసీఎస్ కంపెనీ లాభాలు విశ్లేషకుల అంచనాల స్థాయిలో లేకపోవడంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 4 శాతం నుంచి 8 శాతం మధ్య లాభపడ్డాయి. టీసీఎస్, డా రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.41 వద్ద ఉంది.