నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. వరుసగా మూడో రోజు ఇదే పంథా..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను చవిచూశాయి. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి గరిష్ఠాలతో దూసుకెళ్తున్న సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, టెలికాం రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో స్టాక్ మార్కెట్లు పతనమవక తప్పలేదు. ఇటీవల స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల వద్ద కదలాడుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారని, అందుకే మార్కెట్లు వరుసగా పతనమవుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో బీఎస్ఎస్ సెన్సెక్స్ ఏకంగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను చవిచూశాయి. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయి గరిష్ఠాలతో దూసుకెళ్తున్న సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, టెలికాం రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో స్టాక్ మార్కెట్లు పతనమవక తప్పలేదు. ఇటీవల స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల వద్ద కదలాడుతుండడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించారని, అందుకే మార్కెట్లు వరుసగా పతనమవుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలతో బీఎస్ఎస్ సెన్సెక్స్ ఏకంగా 61 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. ఉదయం ప్రారంభంలో మెరుగ్గా ర్యాలీ చేసినప్పటికీ తర్వాత కొంత సేపటికే నష్టాలను ఎదుర్కొంది. ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు కుదేలైనప్పటికీ చివర్లో నష్టాలను తగ్గించుకుంది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 336.46 పాయింట్లు పతనమై 60,923 వద్ద, నిఫ్టీ 88.50 పాయింట్లు కోల్పోయి 18,178 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాలు సానుకూలంగానే ముగిశాయి. మెటల్, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఏషియన్ పెయింట్, రిలయన్స్, ఇన్ఫోసిస్, డా రెడ్డీస్, టాటా స్టీల్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.83 వద్ద ఉంది.