సీనియర్ అధికారులకు ఇక హోటళ్లలో బస!

ఆ 160 మంది మర్కజ్ యాత్రికుల జాడేది? నేడు సీఎంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు దిశ, న్యూస్ బ్యూరో:  కరోనా కట్టడిలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఆరోగ్యపరిరక్షణపట్ల అప్రమత్తతను పాటిస్తోంది. నియంత్రణ చర్యల్లో నిమగ్నమైనవారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందుజాగ్రత్తలపై ముందుచూపుతో సాగుతోంది. రాష్ట్రంలో పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్లకు వెళ్లకుండా హోటళ్ళలో బస చేసేందుకు […]

Update: 2020-04-01 09:31 GMT

ఆ 160 మంది మర్కజ్ యాత్రికుల జాడేది?
నేడు సీఎంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు

దిశ, న్యూస్ బ్యూరో:

కరోనా కట్టడిలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఆరోగ్యపరిరక్షణపట్ల అప్రమత్తతను పాటిస్తోంది. నియంత్రణ చర్యల్లో నిమగ్నమైనవారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందుజాగ్రత్తలపై ముందుచూపుతో సాగుతోంది. రాష్ట్రంలో పలువురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్లకు వెళ్లకుండా హోటళ్ళలో బస చేసేందుకు పలువురు ఉన్నతాధికారులకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ముఖ్యమైన అధికారులతోపాటు కరోనా నియంత్రణకు సంబంధించిన విధుల్లో పాల్గొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. విధుల్లో ఉన్నవారు తిరిగి ఇళ్ళకు వెళ్తున్నందున ఏవైనా లక్షణాలు ఉంటే అవి కుటుంబ సభ్యులకు సోకుతాయేమోనని ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనాను కట్టడి చేసే విధుల్లో వైద్యారోగ్యం, పోలీసు, పట్టణాభివృద్ధి, జీహెచ్ఎంసీ తదితర కొన్ని శాఖలు చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ శాఖల్లోని అధికారులు ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయేవరకు సమీక్షాసమావేశాల్లోనో, నగరంలోని ఆయా ప్రాంతాల పర్యటనలోనో గడుపుతున్నారు. అయితే చాలామంది క్రిందిస్థాయి అధికారులు విధి నిర్వహణలో భాగంగా చాలాచోట్ల తిరుగుతూ వస్తున్నందున ఒక్కరికి ఇన్‌ఫెక్షన్ సోకినా మిగిలినవారికి అంటుకునే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గిపోయే వరకు దీన్ని అమలు చేయాలనుకుంటోంది. ఇళ్ళకు వెళ్ళడం ద్వారా కుటుంబ సభ్యులకు కూడా సోకే ప్రమాదాన్ని గుర్తించి ఈ దిశగా అడుగులు వేసింది. కరోనా విధుల్లో ఉన్న డాక్టర్లతోపాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పదుల సంఖ్యలో ఇన్‌‌ఫెక్షన్ వచ్చిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిలువరించే ఉద్దేశంతో ఈ చర్యలకు పూనుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌లో ఉన్న ముగ్గురికి, ఒక డాక్టర్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఇది అధికారుల స్థాయి వరకూ వస్తే రోజువారీ పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పనులకు ఆటంకం కలగకుండా ఈ ప్రత్యామ్నాయ నిర్ణయం జరిగింది. గురువారం సీఎంతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు, రాష్ట్రంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దాని ద్వారా వచ్చిన ఫలితాల గురించి గవర్నర్‌ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సైతం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

మర్కజ్ మసీదుకు వెళ్ళివచ్చిన వారి ద్వారా వ్యాపించిన వైరస్ తీవ్రతపై చర్చించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించే అవకాశం ఉంది. మర్కజ్ మసీదుకు వెళ్ళివచ్చినవారి సంఖ్య హెచ్చుగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్దగా లేకపోవడం, తక్కువ వ్యవధిలోనే అలాంటివారిని గుర్తించి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో ప్రశంసించే అవకాశం ఉంది. 160 మంది వివరాల కోసం ముమ్మర యత్నం హైదరాబాద్ నగరం నుంచీ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెయ్యి మందికిపైగానే వెళ్ళి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది.

అయితే ఆ 160 మంది వివరాలను మాత్రం ఇంకా సేకరించలేకపోయింది. వారు నగరానికి చెందినవారా, ఇతర జిల్లాలకు దినవారా అనేది తేలాల్సి ఉంది. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారిలో చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడడం, తెలంగాణలో మంగళవారం వెల్లడైన 15 కేసులు.. అక్కడికి వెళ్ళివచ్చినవారే కావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, నగర పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు మిగతావారి కోసం జల్లెడ పడుతున్నారు. 160 మంది తప్ప మిగిలినవారి సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ 160 మంది కోసమే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ సైతం మీడియా సమావేశంలో ఆ 160 మంది గురించే ప్రస్తావించారు. ఢిల్లీ నుంచి, కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఆ 160 మంది పేర్కొన్న అడ్రస్‌లు ఇక్కడ సరిపోకపోవడంతో వారి జాడ తెలియలేదు. వారు రాష్ట్రానికి వచ్చారా, వస్తే ఇతర చోట్ల ఉన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, కుటుంబ సభ్యులకు ఏ మేరకు సోకే అవకాశం ఉందో తెలియక రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆందోళన పడుతున్నారు.

Tags:    

Similar News