స్కామ్ 2003 @ స్టాంప్ పేపర్ స్కామ్ ఆధారంగా సిరీస్
దిశ, ఫీచర్స్: బయోపిక్స్ మాత్రమే కాదు కుంభకోణాలు కూడా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో నిలిచే ఈ స్కామ్స్ ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు చాలానే రాగా బాలీవుడ్‌లోనూ ‘స్పెషల్ 26, డాలీ కి డోలి, ఆంఖేన్’ చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్స్ ‘గఫ్లా, డర్టీ మనీ, బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ : ఇండియా’ వంటి డాక్యుమెంటరీ సిరీస్‌లు స్కామ్స్ నేపథ్యంలో వచ్చాయి. ఈ క్రమంలో […]
దిశ, ఫీచర్స్: బయోపిక్స్ మాత్రమే కాదు కుంభకోణాలు కూడా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో నిలిచే ఈ స్కామ్స్ ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. హాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు చాలానే రాగా బాలీవుడ్‌లోనూ ‘స్పెషల్ 26, డాలీ కి డోలి, ఆంఖేన్’ చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్స్ ‘గఫ్లా, డర్టీ మనీ, బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ : ఇండియా’ వంటి డాక్యుమెంటరీ సిరీస్‌లు స్కామ్స్ నేపథ్యంలో వచ్చాయి. ఈ క్రమంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడిన హర్షద్ మెహతా ఇతివృత్తంతో సోని లైవ్‌లో ‘స్కామ్ 1992- హర్షద్ మెహతా’ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే. ‘అలీఘర్, ఒమెర్టా’ వంటి భిన్నమైన కథాంశాలతో పాటు ‘షాహిద్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని మనకు అందించిన దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. గతేడాది విడుదలైన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా, హన్సల్ మెహతా ఈసారి దేశాన్ని కదలించిన ‘స్టాంప్ పేపర్ స్కామ్’ ఆధారంగా ‘స్కామ్ 2003: ది క్యూరియస్ కేస్ ఆఫ్ అబ్దుల్ కరీం తెల్గీ’ పేరుతో సిరీస్ తీసుకొస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ‘స్టాంప్ పేపర్ స్కామ్’ ఏమిటీ? దాని వెనుకున్నది ఎవరు? అనే వివరాలు మీ కోసం..
కర్త, కర్మ, క్రియ అబ్దుల్ కరీం తెల్గీ..
2003లో నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. స్కామ్ విలువ దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన వ్యక్తి అబ్దుల్ కరీం తెల్గీ కాగా, ఈ స్కామ్ వల్ల అతడు వేల కోట్ల రూపాయలు కూడబెట్టాడు. సంజయ్‌సింగ్ అనే జర్నలిస్టు ఈ మోసాన్ని బయటపెట్టడంతో పాటు ‘రిపోర్టర్ కి డైరీ’ అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకం ఆధారంగానే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మరాఠీ రచయిత కిరణ్ యాడ్నియోపావిట్ కూడా సంజయ్‌సింగ్‌తో పాటు ఈ పుస్తకం రాయడానికి సాయపడ్డాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతేడాది ‘ఉల్లు’ ప్లాట్‌ఫామ్‌పై రోహిత్ బోస్ రాయ్ నటించిన ‘పేపర్’ అనే వెబ్ సిరీస్ కూడా ఇదే అంశంపై తెరకెక్కి రిలీజ్ అయింది. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ ఆధారంగా 2008లోనూ ‘ముద్రాంక్ (ది స్టాంప్)’ అనే ఓ చిత్రం నిర్మించారు. కానీ తెల్గీ ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా కేసు ఫైల్ చేశాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, అసంబద్ధ వివరాలు చట్టపరమైన విజ్ఞప్తులను దెబ్బతీస్తాయని తెల్గీ ఆరోపించాడంతో ఆ చిత్రం విడుదల ఆగిపోయింది. దాంతో ఇప్పటికీ ఆ చిత్రం విడుదల కాలేదు.
బీజం పడింది అక్కడే..
అబ్దుల్ కరీం తెల్గీ కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందినవాడు. అతని తండ్రి ఇండియన్ రైల్వే ఉద్యోగి. కరీం తెల్గీ చిన్నతనంలోనే ఆయన తండ్రి మరణించాడు. రైళ్లలో ప్రయాణికులకు కూరగాయలు, పండ్లు, వేరుశెనగలను అమ్ముతూ వచ్చిన డబ్బులపైనే కరీం కుటుంబం జీవనం సాగించింది. తెల్గీ బీకామ్ చదువుకోగా, ఉద్యోగం కోసం ముంబైకి, ఆ తర్వాత సౌదీకి వెళ్లాడు. ఏడేళ్లు సౌదీలో ఉన్న తర్వాత, ముంబైకి తిరిగి వచ్చి నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీపై దృష్టిపెట్టాడు కరీం. సౌదీకి మహిళలను అక్రమ రవాణా చేయడంతో పాటు, ట్రావెల్ ఏజెంట్‌గా ‘అరేబియా మెట్రో ట్రావెల్స్’ అనే సంస్థను ప్రారంభించాడు. క్రమంగా ఫేక్ పాస్‌పోర్ట్‌తో పాటు నకిలీ స్టాంప్ పేపర్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. 350 మందికి పైగా ఏజెంట్లును నియమించుకుని బ్యాంకులు, బీమా సంస్థలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు అమ్మేశాడు. ఈ స్కామ్ అన్ని రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు ఇందులో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఇన్‌వాల్వ్ అయ్యారు. 1993లో తెల్గీ మీద అనుమానం వచ్చిన పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడే తెల్గీ కథ మలుపు తిరిగింది. కస్టడీలో ఉన్నప్పుడు, కోల్‌కతాలో పనిచేస్తున్న ప్రభుత్వ స్టాంప్ విక్రేత రామ్ రతన్ సోనిని తెల్గీ కలిశాడు. ఇక్కడే పెద్ద మోసాలకు పాల్పడే వ్యూహారచన చేశారు. కమీషన్‌కు బదులుగా అతికించే(adhesive) స్టాంపులు, నాన్-జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌లను విక్రయించడానికి సోని..తెల్గీని నియమించుకున్నాడు.
ముంబైలో ఓన్ ప్రింటింగ్ ప్రెస్
1994లో సోనితో కలిసి పనిచేస్తున్నప్పుడు, తెల్గీ తన నెట్‌వర్క్ ఉపయోగించుకుని, చట్టపరమైన స్టాంప్ విక్రేతగా మారడానికి లైసెన్స్ పొందాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అనేక స్టాంప్ పేపర్లను నకిలీ చేయడంతో వారి వ్యాపారం బాగా పెరిగింది. తెల్గీ ఒరిజనల్ స్టాంప్ పేపర్లను నకిలీ పేపర్లతో మిళితం చేసి, భారీ లాభాలకు అమ్మేసేవాడు. నకిలీ స్టాంపుల ద్వారా సంపాదించిన డబ్బుతో పలు వ్యాపారాల్లోకి ప్రవేశించాడు. 1995లో తెల్గీ, సోని విడిపోయారు. నకిలీ స్టాంపులు అమ్మినట్లు పలుకేసులు నమోదు కాగా తెల్గీ లైసెన్స్ రద్దు చేశారు. అయితే అప్పటికే ప్రింటింగ్‌పై పూర్తి అవగాహన ఉన్న తెల్గీ, కొంతమంది అండతో 1996లో ముంబైలోని మింట్ రోడ్‌లో తన సొంత ప్రెస్‌ను ఏర్పాటు చేశాడు. తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి, వాడుకలో లేనిదిగా ప్రకటించిన అనేక యంత్రాలను పొంది, ప్రెస్‌ను ఏర్పాటు చేశాడు.
ఎండ్ కార్డ్
ఈ క్రమంలో నకిలీ స్టాంప్ పేపర్ల బిజినెస్ జోరుగా సాగుతున్న వేళ, కర్ణాటక పోలీసులు 2000లో బెంగళూరులో నకిలీ స్టాంప్ పేపర్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేశారు. దాంతో స్టాంప్ పేపర్ స్కామ్ సూత్రధారి కరీం తెల్గీ పేరు బయటకు వచ్చింది. తెల్గీని 2001 నవంబర్‌లో అజ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును చివరికి సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. తెల్గీకి దేశవ్యాప్తంగా 36 ప్రాపర్టీలు ఉన్నాయని, 18 ప్రధాన నగరాల్లో 100కి పైగా బ్యాంకు ఖాతాలున్నాయని కనుగొన్నారు. ఈ స్టాంప్ పేపర్ స్కామ్ విలువ రూ.20,000 కోట్లు అని అంచనా వేయగా, ఇది దేశం మొత్తాన్ని కుదిపేసింది. తెల్గీని ఈ కేసులో దోషిగా తేల్చడంతో పాటు అతని సహచరులలో చాలామందికి 2006లో 30 సంవత్సరాల జైలు శిక్ష, రూ.202 కోట్ల ఫైన్ విధించింది. కుంభకోణంలోని మరో కోణం తెలిసిన తర్వాత 28 జూన్ 2007లో తెల్గీకి మరో 13 ఏళ్ల కఠినమైన జైలు శిక్షతో పాటు, 10 బిలియన్ల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించడానికి తెల్గీ ఆస్తిని జప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అభ్యర్థించింది. 2017 అక్టోబర్‌లో బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా అబ్దుల్ కరీం తెల్గీ 56 ఏళ్ల వయసులో మరణించాడు. కాగా ఓ సాధారణ వ్యక్తి ఇంత తెలివిగా అందర్నీ ఎలా మోసం చేశాడు? పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎలా సంబంధాలు ఏర్పరుచుకున్నాడు? పదికిపైగా రాష్ట్రాల్లో అనుచరులను ఎలా పొందాడు? కోటానుకోట్ల రూపాయలు సంపాదించడంలో తెల్గీ అనుసరించిన వ్యూహం ఎలాంటిది? తదితర ఆసక్తికరమైన అంశాలతో హన్సల్ మెహతా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతున్నాడు. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తిచేసి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో కనిపించనున్న నటీనటుల గురించి మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.