పాదయాత్రలకు బ్రేక్.. ఈసీ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పన్నెండు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూలుతో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో భారీ స్థాయిలో జనాన్ని సమీకరించే బహిరంగ సభలు, పాదయాత్రలు, ర్యాలీలపై ఆంక్షలు విధించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు లోబడి అనుమతి తీసుకుని పాదయాత్ర నిర్వహించుకోవచ్చని వివరించారు. తొమ్మిది […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పన్నెండు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూలుతో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో భారీ స్థాయిలో జనాన్ని సమీకరించే బహిరంగ సభలు, పాదయాత్రలు, ర్యాలీలపై ఆంక్షలు విధించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు లోబడి అనుమతి తీసుకుని పాదయాత్ర నిర్వహించుకోవచ్చని వివరించారు. తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున అక్కడ మాత్రమే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని, హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు లేనందువల్ల కోడ్ అమలులో ఉండదని పేర్కొన్నారు. షెడ్యూలు విడుదలైనందున కోడ్ వెంటనే అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, పార్టీలు కొవిడ్ నిబంధనలను పాటించాలని, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో అమలు చేసిన నిబంధనలన్నీ ఇక్కడ కూడా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దానికి తగినట్లుగానే పోలింగ్ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహించాల్సి వస్తే గరిష్టంగా 500 మంది కంటే ఎక్కువ మంది హాజరుకారాదని వివరించారు.
సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తామని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్‌లు ఉండరని, నామినేషన్ సందర్భంగా అభ్యర్థితో పాటు మరో వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీలు నిషేధమని తెలిపారు.