ఇసుక రవాణాలో మరో కోణం

దిశ ప్రతినిధి, కరీంనగర్: దర్జాగా ఇసుక రవాణా చేయాలి, అధికారులు పట్టుకున్నా అంతా లీగల్ గానే సాగుతోంది అన్నట్టుగా చూపించాలి. ఇందుకు తగిన ఉపాయం ఆలోచిస్తే చాలనుకున్నారు అక్రమార్కులు. ఆ ఒక్క ఐడియా వారి జీవితాన్నే మార్చేస్తోంది. సూపర్ డూపర్‌గా సక్సెస్ అయిన ఈ ఉపాయంతో సర్కారు ఆదాయాన్ని కొల్లగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు సీక్రెట్ గా సాగిన ఈ దందా ఇప్పుడు నిర్భయంగా జరుపుతున్నారు. బ్రేక్ డౌన్.. టీఎస్ఎండీసీ జారీ చేసిన వే […]

Update: 2021-02-10 20:19 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: దర్జాగా ఇసుక రవాణా చేయాలి, అధికారులు పట్టుకున్నా అంతా లీగల్ గానే సాగుతోంది అన్నట్టుగా చూపించాలి. ఇందుకు తగిన ఉపాయం ఆలోచిస్తే చాలనుకున్నారు అక్రమార్కులు. ఆ ఒక్క ఐడియా వారి జీవితాన్నే మార్చేస్తోంది. సూపర్ డూపర్‌గా సక్సెస్ అయిన ఈ ఉపాయంతో సర్కారు ఆదాయాన్ని కొల్లగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు సీక్రెట్ గా సాగిన ఈ దందా ఇప్పుడు నిర్భయంగా జరుపుతున్నారు.

బ్రేక్ డౌన్..

టీఎస్ఎండీసీ జారీ చేసిన వే బిల్లు ద్వారా ఇసుక రవాణా చేస్తున్న కొంతమంది సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఒకే వే బిల్లును రీ సైకిల్ చేస్తూ ఎవరికీ చిక్కకుండా తప్పించుకునే పనిలో పడ్డారు అక్రమార్కులు. ఇసుక రీచ్ నుంచి లారీ బయలుదేరిన తర్వాత కొంత సేపటికి లారీలో సాంకేతిక సమస్య ఎదురయిందన్న సమాచారం ఇచ్చి ఆ ఇసుకను దారి మళ్లించి విక్రయించుకునే పద్దతి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. బ్రేక్ డౌన్ అయిందన్న విషయాన్ని సంబంధిత టీఎస్ఎండీసీ అధికారులకు చేరవేసి దర్జాగా ఇసుకను అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వే బిల్లుపై కూడా బ్రేక్ డౌన్ అని రాయించుకుని రెండో సారి అదే వే బిల్లుపై ఇసుక రవాణా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బ్రేక్ డౌన్ అనగానే లారీ చెడిపోయినందును సకాలంలో ఇసుక తరలించే అవకాశం లేదని, మరునాటికి కూడా అదే వే బిల్లుపై రవాణా చేసేందుకు అనుమతి ఇస్తుంటారు. ఇదే కొంతమంది పాలిట వరంగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది.

ఉదాసీనంగా రవాణాశాఖ

బ్రేక్ డౌన్ అని చెప్పినప్పుడు తరలించిన ఇసుకను హైదరాబాద్‌కు కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో విక్రయించి మరునాడు ముందు రోజు తీసుకున్న వే బిల్లుపైనే ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెల్లవారు జామున లేదా అర్థరాత్రి వేళల్లో ఈ లారీల్లో ఇసుక లోడ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అటు ఓవర్ లోడ్ రూపంలో ఇటు లారీల బ్రేక్ డౌన్ పేరిట వేబిల్లులను రీ సైకిల్ చేస్తూ లక్షల్లో డబ్బును సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. అయితే లారీ బ్రేక్ డౌన్ ఎలా అయింది? ఎప్పటి వరకు అది బాగవుతుంది తదితర అంశాలను పరిశీలించేందుకు ఎవరూ కూడా దృష్టి సారించకపోవడం విడ్డూరం. ఇదంతా టీఎస్ఎండీసీ, క్వారీ నిర్వహకులు, లారీ ఓనర్ల మధ్య సమన్వయంతోనే సాగుతోందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తే ఇప్పటికే సర్కారు కోట్లాది రూపాయలు నష్టపోయిన విషయం బహిర్గతం అవుతోందని అంటున్నారు స్థానికులు.

స్థానిక అవసరాలకు..

స్థానిక అవసరాల కోసం జారీ చేస్తున్న వే బిల్లులు కూడా రీ సైకిల్ అవుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఈ తతంగం పెద్ద ఎత్తున సాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మాన్యూవల్‌గా ఇచ్చే వే బిల్లు ద్వారా ఒక్కో ట్రాక్టర్ ద్వారా 10 నుంచి 15 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరు రీచ్ నుంచి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు గతంలో ఇచ్చిన వే బిల్లులను చూపిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. స్థానిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఆసరాగా చేసుకున్న ట్రాక్టర్ యజమానులు ఒక్కసారి ప్రభుత్వానికి డబ్బు చెల్లించి అదే వే బిల్లును రీ సైకిల్ చేస్తూ సామాన్యుల నుంచి వేలాది రూపాయలు దర్జాగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న మాఫియా అడ్డుకునే వారిపై తిరగబడుతుండటం విశేషం.

Tags:    

Similar News