నేతల మధ్య ఇసుక లొల్లి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని అధికార లేదా అనధికారికంగా రీచ్‌నుంచి ఒక్క ఇసుక రేణువు కూడా ఆర్మూర్నియోజకవర్గానికి వెళ్లొద్దనేది అక్కడి ప్రజాప్రతినిధి ఆర్డర్. దీంతో కొన్ని రోజులుగా కాళేశ్వరం నుంచి వచ్చే ఇసుకనే వాడుతుండడంతో ఇసుక ధరకు రెక్కలు వచ్చాయి. ఆర్మూరు, బాల్కొడ వేర్వెరు నియోజకవర్గాలైనప్పటికి ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాల్లో ఇసుక పంచాయతీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బాల్కొండ, ఆర్మూర్నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధులకు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని అధికార లేదా అనధికారికంగా రీచ్‌నుంచి ఒక్క ఇసుక రేణువు కూడా ఆర్మూర్నియోజకవర్గానికి వెళ్లొద్దనేది అక్కడి ప్రజాప్రతినిధి ఆర్డర్. దీంతో కొన్ని రోజులుగా కాళేశ్వరం నుంచి వచ్చే ఇసుకనే వాడుతుండడంతో ఇసుక ధరకు రెక్కలు వచ్చాయి. ఆర్మూరు, బాల్కొడ వేర్వెరు నియోజకవర్గాలైనప్పటికి ప్రస్తుతం ఆ రెండు నియోజకవర్గాల్లో ఇసుక పంచాయతీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు
బాల్కొండ, ఆర్మూర్నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ప్రజాప్రతినిధులకు మొదటి నుంచీ పొసగకపోవడంతో అంతగా సఖ్యత, సంబంధాలు లేవు. దానికి తోడు ఒకరిని మించి మరొకరు అధిపత్యం ప్రదర్శిస్తుండంతో వారి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అందులో ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వడంతో మరొకరికి కంటగింపుగా మారింది. అధినేత ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అది మొక్కుబడిగా ఆరోజు వరకే పరిమితమైంది. బహిరంగంగా ఇద్దరి మధ్య నేరుగా ఎలాంటి విబేధాలు లేకపోయినా నియోజకవర్గానికి ఇసుక రవాణాపై బ్యాన్ విధించినప్పటి నుంచి ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా పోలీసు, రెవెన్యూ శాఖలు ఆ ప్రాంత సరిహద్దులను దాటనివ్వడం లేదు.
నిలిచిన ఇసుక రవాణా
పెద్దవాగు, వేల్పూర్ వాగు, కొలిపాకా, కుకూనుర్ కోమన్ పల్లి, తోర్తి, సుంకేట్, షట్పల్లి లాంటి ఇసుక పాయింట్లు బాల్కొండ పరిధిలో ఉన్నాయి. ఆర్మూర్ పరిధి తల్వేదా, అల్వాపూర్, కంఠం, జన్నేపల్లి వాగుల నుంచి అధికారికంగా ప్రభుత్వ అభివృద్ధి పనులకు బుధ, శుక్రవారాల్లో ఇసుకను తరలిస్తుంటారు, కానీ, అనధికారికంగా ఇసుక తవ్వకాలన్నీ స్థానిక వీడీసీ కన్నుసన్నుల్లోనే కొనసాగుతున్నాయి. అయితే అర్మూర్ నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ఇసుక తవ్వకాలు లేవు. దీంతో ఆక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం, సర్కారు, ప్రైవేట్ పనులకు అవసరమయ్యే ఇసుక కోసం పొరుగున ఉన్న బాల్కొండలోని ఇసుక పాయింట్లపై ఆధారపడాల్సి వచ్చింది. కొన్ని రోజుల వరకు ఇసుక సైతం రవాణా జరిగింది. ప్రస్తుతం ఏం జరిగిందో ఏమో కానీ, సదరు ప్రజాప్రతినిధి అదేశాల మేరకు అక్కడి నుంచి ఆర్మూర్‌కు ఇసుక రవాణా నిలిచిపోయింది.
కాళేశ్వరం ఇసుకే దిక్కు
ఆర్మూర్ లో అభివృద్ధి పనులకు ఇసుక రవాణా నిలిచిపోవడంతో పూర్వపు ఆదిలాబాద్జిల్లా పరిధి కాళేశ్వరం నుంచి ఇసుక ను తరలిస్తున్నారు. గతంలో లోకల్ ఇసుక టన్నుకు నాణ్యతను బట్టి రూ. 900 నుంచి రూ. 1200 తీసుకునే వారు. కానీ, ఇప్పుడు కాళేశ్వరం ఇసుక మాత్రం టన్నుకు రూ.1200 నుంచి ప్రారంభమై, ప్రజల అవసరాలను బట్టి ధర పెంచి వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ ఆర్మూర్ ప్రజలకు ఇసుక కష్టాలను తెచ్చిపెట్టింది.