ఆరుగాలం శ్రమ.. ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోయింది..
దిశ, కాటారం : ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం విక్రయానికి ముందే తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం నిన్నరాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. వరి కోతలు ప్రారంభమయ్యాక పొలం నుంచి తీసుకొచ్చిన వడ్లను ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే, ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని వారం రోజులుగా రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మలహర్ మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో […]
దిశ, కాటారం : ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం విక్రయానికి ముందే తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం నిన్నరాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. వరి కోతలు ప్రారంభమయ్యాక పొలం నుంచి తీసుకొచ్చిన వడ్లను ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే, ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని వారం రోజులుగా రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మలహర్ మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో చివరకు రైతులకు కన్నీళ్లే మిగిలాయి.
పంట చేతికొచ్చినా కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంగా కావడంతో అన్నదాతలు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి రావడంతో ఏంచేయాలో తోచని పరిస్థితుల్లో రైతులున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు భారీ వర్షానికి కొంత మేర కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. రుద్రారం, కొయ్యూరు, రేగుల గూడెం, దేవరపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం కళ్లముందే కొట్టుకుపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటూ విలపిస్తున్నారు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.