10శాతం ఇవ్వాల్సిందే.. లేకుంటే!

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతిని తేల్చేందుకు చూడాల్సిన లెక్కలకు కూడా అవినీతి మరకలంటుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చేస్తున్న ఆడిట్​కు స్థానిక ప్రజాప్రతినిధులు 1‌‌0 శాతం చేతుల్లో పెట్టాల్సి వస్తోంది. లేకుంటే సంబంధిత అధికారులే నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా… స్వచ్ఛంద సంఘాలతో పిటిషన్లు వేయించి నిధుల వినియోగంపై కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు అడిటింగ్లో రశీదులు సరిగా లేవని నిధుల రికవరీకి ఆదేశాలిచ్చారు. అయితే కేవలం తమకు ‘సహకరించని’ సర్పంచ్​లనే టార్గెట్​గా చేస్తూ అడిట్ లెక్కలపై […]

Update: 2021-01-11 20:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతిని తేల్చేందుకు చూడాల్సిన లెక్కలకు కూడా అవినీతి మరకలంటుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చేస్తున్న ఆడిట్​కు స్థానిక ప్రజాప్రతినిధులు 1‌‌0 శాతం చేతుల్లో పెట్టాల్సి వస్తోంది. లేకుంటే సంబంధిత అధికారులే నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా… స్వచ్ఛంద సంఘాలతో పిటిషన్లు వేయించి నిధుల వినియోగంపై కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు అడిటింగ్లో రశీదులు సరిగా లేవని నిధుల రికవరీకి ఆదేశాలిచ్చారు. అయితే కేవలం తమకు ‘సహకరించని’ సర్పంచ్​లనే టార్గెట్​గా చేస్తూ అడిట్ లెక్కలపై ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల ఓ సర్పంచ్ దీనిపై అధికారులను నిలదీసిన వైనం హాట్​టాపిక్​గా మారుతోంది.

ఆర్థిక సంఘం నిధుల అంశం కావడంతోనే సమస్య

ప్రస్తుతం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో అడిట్ నడుస్తోంది. ఈ అడిట్ లెక్కలన్నీ సమర్పిస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతోనే అసలు సమస్యగా మారుతోంది. ఎందుకంటే ఆర్థిక సంఘం నిధులు రావాలంటే వెచ్చించిన నిధులకు లెక్కలు చెప్పడం, కొన్నిలెక్కల అంశాలు పంచాయతీల్లో సరిగా రికార్డుకెక్కకపోవడంతో సర్పంచ్లు, పాలకవర్గాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇదే అదునుగా అడిట్ అధికారులు మరింతగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వెచ్చించిన నిధుల్లో నుంచి కచ్చితంగా తమకూ 10 శాతం ఇవ్వాల్సిందేనంటూ పట్టుపడుతున్నట్లు పలు జిల్లాల్లో విమర్శలున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులుంటే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది.

ఏండ్ల నుంచి వస్తున్న ఆనవాయితే అట..

మరోవైపు అడిట్ అధికారులు ఇదంతా పాత సంప్రదాయమేనంటూ చెప్పుకుంటున్నారు. ఏడాదికోసారి నిర్వహించే అడిట్​ లెక్కలకు కనీసం 10 శాతం ఇవ్వడం ఏండ్ల నుంచి వస్తున్న ఆచారమేనని, ఇందులో కొత్తేమీ లేదంటున్నట్లు చెప్పుతున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు లెక్కలున్నా.. లేకున్నా వాటికి సంబంధించిన వాటిల్లో అడిట్కు వాటా ఉండాల్సిందేననే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అడిట్​కు సహకరించకుండా ఉంటే మాత్రం ఆయా ప్రాంతాల్లోని పలు సంస్థలు వారికి అనుకూలంగా మారుతున్నాయి. వారిలో ఎవరి ఒకరితో అడిట్​కు సంబంధించిన అంశాలపై లేఖ ఇప్పించుకోవడం, దానికి సంబంధించిన అంశాలను పాలకవర్గాలపై ప్రశ్నించడం జరుగుతోంది. దీంతో ఇవన్నీ తట్టుకోలేక అడిట్ అధికారుల దారిలోకి వెళ్లమేనని భావిస్తున్నారు.

చెప్పని లెక్కలు చాలా ఉంటాయి…!

మరోవైపు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయని, బహిరంగంగా చెప్పుకోలేని లెక్కలు చాలా భరించాల్సి వస్తుందని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఓవైపు జీతభత్యాలు, ట్రాక్టర్, ట్రాలీ ఈఎంఐలకే సరిపోతున్నాయని, సొంత ఆదాయంతో వచ్చే నిధులతో ఏదైనా పనులు చేద్దామంటే అధికారులతో ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. అయితే రోజుకో అధికారి, రోజుకో ప్రజాప్రతినిధి గ్రామాలకే వస్తున్నారని, వీటికి సంబంధించిన ఖర్చులన్నీ స్థానిక సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులే భరించాల్సి వస్తుందని, వాటిని ఎలా బిల్లుల్లో చూపించుకుంటామని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన లెక్కలపై అడిట్​ అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

గ్రామాల్లో కంప్లీట్… మున్సిపాలిటీల్లో కంటిన్యూ..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీల నిధుల వినియోగంపై ఆడిట్‌ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నా గ్రామాల్లో సమగ్ర పాలన లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీలో ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. ఆన్ లైన్ అడిట్లో భాగంగా ముందుగా 35 శాతం పంచాయతీల్లో చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలుంటే… వాటిలో 4462 పంచాయతీల్లో ఆన్​లైన్, మిగిలిన వాటిలో ఆఫ్​లైన్​ పద్దతిలో చేస్తున్నారు. నిధుల వినియోగంపై ఆడిట్‌ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని ఆంక్షలు విధించింది. దీంతో పంచాయతీల్లో ఆడిట్‌ అనివార్యమైంది. ఇప్పటికే నిధుల వినియోగంలో పంచాయతీల్లో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పల్లె ప్రగతి ప్రణాళిక నిధులు విడుదల చేస్తున్నా.. ఇవి సరిపోవడం లేదనేది స్పష్టమైంది. పంచాయతీల్లో పని చేసే కార్మికుల వేతనాలు, విద్యుత్‌ బిల్లులు ఇక నుంచి ప్రతి నెలా చెల్లించాలని ఆదేశాలివ్వడం, ట్రాక్టర్ల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలతో నిధులన్నీ ఖర్చవుతున్నాయి. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ ఉండాలని, పారిశుధ్య కార్మికులకు వేతనాలు రూ.8,500ల చొప్పున పెంచడం, మల్టీపర్పస్‌ కార్మికులుగా గుర్తించి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నిధులు వాటికే సరిపోతున్నాయి. గతంలో పంచాయతీల్లో వినియోగించిన నిధులకు యూసీలు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్స్‌) సమర్పిస్తే వాటినే పరిగణలోకి తీసుకుని నిధులు విడుదల చేసేవారు. కానీ, ఇక నుంచి కేంద్ర ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పనిసరి చేసింది. అంటే పంచాయతీల్లో వెచ్చించిన ప్రతి రూపాయికి ఎమ్మార్పీ ధరలను అనుసరిస్తూ వాటికి సంబంధించిన రశీదులను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆడిట్‌లో ధ్రువీకరించిన తర్వాతే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ తప్పని సరిగా చేయడంతో ప్రతిపైసా లెక్కించాలని సూచించింది. పంచాయతీకి వచ్చిన ఆదాయం, పన్నులు, చేసిన ఖర్చులన్నీ ఆన్‌లైన్‌ ఆడిట్‌లో స్పష్టం చేసిన తర్వాత వాటి ఆమోదం వస్తేనే కేంద్రం నిధులు రానున్నాయి. దీంతో అడిట్​లో భారమైనా పాలకవర్గాలు నెత్తినేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

కోట్ల రికవరీకి నోటీసులు..

అడిట్ అధికారులకు సహకరించిన పాలకవర్గాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. రశీదులు సక్రమంగా లేవని, ఖర్చులు అనుకున్నట్టుగా చూపించలేదంటూ నోటీసుల్లో పేర్కొంటున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 27వేల అభ్యంతరాలు అడిట్​ అధికారులకు వచ్చినట్లు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే ఈ అభ్యంతరాలకనుగుణంగా దాదాపు 11 వేల పంచాయతీల్లో అడిట్ లెక్కలకు అనుగుణంగా లేకుండా ఖర్చు పెట్టిన రూ. 22 కోట్ల నిధుల రికవరీకి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెప్పుతున్నారు. కేవలం అడిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే వీటికి షోకాజ్ నోటీసులు అందినట్లు భావిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాల్లోనే మొత్తం 1,307 అభ్యంతరాలు రాగా… వీటికి సంబంధించి రూ.79,37,480 రికవరీకి సిఫారస్సు చేశారు. 45 రోజుల్లో అధికారులు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సంజాయిషీ ఇవ్వాలని, లేకపోతే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎలాగో కొంత రశీదులు మళ్లీ ఇచ్చి అధికారులతో కలిసిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సర్పంచ్ల సంఘంలోని ప్రధాన నేత వెల్లడించారు.

Tags:    

Similar News