రెవెన్యూ శాఖ.. కదలదా చక చకా..?
భూ ప్రక్షాళనపై అధికారుల నిర్లక్ష్యం దిశ, రంగారెడ్డి : రైతు బంధు, రైతు బీమా పథకాల పేరుతో ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. ఈ పథకాలను ఆసరాగా చేసుకొని భూ ప్రక్షాళనలో తలెత్తిన సమస్యలు బహిర్గతం కాకుండా అడ్డుకట్ట వేస్తోంది. భూ ప్రక్షాళనలో భాగంగా రైతుల పాస్‌బుక్స్‌లో వారి భూ విస్తీర్ణం వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం కాగా..చాలా మంది రైతులు నష్టపోయారు. దీనిని సరిచేసేయాలని ఓ వైపు రైతులు గగ్గోలు పెడుతున్నా..అధికారులు, […]
భూ ప్రక్షాళనపై అధికారుల నిర్లక్ష్యం
దిశ, రంగారెడ్డి :
రైతు బంధు, రైతు బీమా పథకాల పేరుతో ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. ఈ పథకాలను ఆసరాగా చేసుకొని భూ ప్రక్షాళనలో తలెత్తిన సమస్యలు బహిర్గతం కాకుండా అడ్డుకట్ట వేస్తోంది. భూ ప్రక్షాళనలో భాగంగా రైతుల పాస్‌బుక్స్‌లో వారి భూ విస్తీర్ణం వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం కాగా..చాలా మంది రైతులు నష్టపోయారు. దీనిని సరిచేసేయాలని ఓ వైపు రైతులు గగ్గోలు పెడుతున్నా..అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా.. తప్పులు సరిచేయడంలో అలసత్వం వహిస్తోన్న రెవెన్యూ వ్యవస్థ తీరు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైంది.
భూముల ధరలకు రెక్కలు..
జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూమిపై మక్కువ పెరిగింది. ఎప్పుడో తన అవసరాల నిమిత్తం ఓ రైతు భూమిని విక్రయించారు. కాగా కొనుగోలు చేసిన రైతు సాగు చేసుకుంటున్నాడు. కానీ అవగాహన లేక అప్పుడు భూమిని రికార్డులో నమోదు చేయించుకోలేదు. ఇపుడు చేయించుకుందాం అనుకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు. సాగులో ఉన్న రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పించకుండా, గతంలో ఉన్న భూ యాజమాన్య హక్కులు కల్పించడం రైతుల మధ్య భూ పంచాయతీలకు కారణమైంది. పైగా ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆవేదనకు, ఆగ్రహానికి గురైన కొందరు రైతులు.. అధికారులపై దాడులకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ..
ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, రాజేంద్రనగర్ మండలాల పరిధిలో భూదాన్, ఇనాము, దేవాదాయ భూముల సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి ఈ తరహా సమస్యలతో వచ్చే బాధితులే అధికం. జిల్లాలో భూదాన్, ఎండోమెంట్‌కు సంబంధించిన వందల వేల ఎకరాల భూములున్నాయి. ఒకప్పుడు ఇష్టానుసారంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తక్కువకు కొనుగోలు చేసిన రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అనేకమంది రైతులు ఇప్పటికీ భూ మార్పిడి చేసుకోలేదు.. యాచారం మండలానికి చెందిన ఓ రైతు తన 12 ఎకరాల భూమిని 2007లో నగరంలో ఉండే ఓ వ్యాపారికి అమ్మాడు. సదరు వ్యాపారి భూమిని రిజిస్ర్టేషన్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు అటువైపు వెళ్లలేదు. రైతు 2011లో చనిపోయాడు. ఇదే అదనుగా భావించిన రైతు కొడుకు తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. భూమి తన తండ్రి పేరిట ఉందని, తనకు హక్కులు కల్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. ఇలాంటి అనేక సమస్యలు చోటుచేసుకుంటున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలోని రెవెన్యూ వివరాలు ఇలా..
జిల్లాలో 10,98,000 సర్వే నంబర్లు ఉన్నాయి. అందులో 9,60,000 సర్వే నంబర్లలో డిజిటల్ సైన్ పూర్తయ్యాయి. ఇందులో 45 వేల సర్వే నంబర్లు ప్రభుత్వ భూములకు సంబంధించి ఉండగా.. వీటికి డిజిటల్ సైన్ అవసరం లేదు. 3,600 సర్వేనంబర్లు నాలాకు సంబంధించినవి ఉన్నాయి. కాగా పట్టా భూములకు సంబంధించిన 7,514 సర్వే నంబర్లలో డిజిటల్ సైన్ చేయాల్సి ఉంది. డిజిటల్ సైన్ అయ్యాక 20-30 రోజుల్లో పాస్ పుస్తకం వస్తుంది. డిజిటల్ సైన్ అయిన విషయాన్ని సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు.
Tags: Rangareddy, Lands registration, pass books, Revenue Department