ఆందోళనలో రిటైల్ అమ్మకాలు

ముంబయి: రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టనుండటం, భవిష్యత్తుపై బెంగతో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అత్యవసరమైన వస్తువులు మినహా మిగతా వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా లాక్‌డౌన్ కంటే ముందు జరిగిన వ్యాపారంలో మూడో వంతు కూడా ప్రస్తుతం జరగడం లేదని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 అర్ధరాత్రి నుంచి దేశం లాక్‌డౌన్‌లో వెళ్లిన విషయం విధితమే. […]

Update: 2020-05-26 08:34 GMT

ముంబయి: రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టనుండటం, భవిష్యత్తుపై బెంగతో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అత్యవసరమైన వస్తువులు మినహా మిగతా వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా లాక్‌డౌన్ కంటే ముందు జరిగిన వ్యాపారంలో మూడో వంతు కూడా ప్రస్తుతం జరగడం లేదని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 అర్ధరాత్రి నుంచి దేశం లాక్‌డౌన్‌లో వెళ్లిన విషయం విధితమే. నాలుగు విడతల పొడిగింపు తర్వాత ఆంక్షల్లో సడలింపులు ఇచ్చారు. గత 10 రోజులుగా రిటైలర్ దుకాణాలు తెరుచుకుంటున్నాయి. కానీ, మునుపటి స్థాయిలో అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. ప్రముఖ రిటైల్ బ్రాండ్ దుకాణం బిగ్‌బజార్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 295 స్టోర్లలో 88, యూఎస్ పోలో, ఏరో పోస్టేల్ తదితర బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్ 1300 స్టోర్లలో 250 ఔట్‌లెట్లను మాత్రమే ప్రారంభించాయి. అతి తక్కువ సంఖ్యలో స్టోర్లను తెరిచినా అమ్మకాలు మాత్రం 50 శాతం కంటే తక్కువగానే ఉంటున్నాయని రిటైలర్లు పేర్కొంటున్నారు. కరోనా భయాలు ఇప్పట్లో తొలిగే పరిస్థితి లేకపోవడంతో మరికొన్ని నెలలు నష్టాలను భరించక తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినియోగదారులు ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించినా ప్రజలు బయటకు రావడానికి సంకోచిస్తుండటం కూడా అమ్మకాలు ఆశించిన రీతిలో లేకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై జాక్ అండ్ జోన్స్, వెరో మోదా, ఓన్లీ తదితర బ్రాండ్ల విక్రయ సంస్థ ‘బెస్ట్ సెల్లర్’ ఇండియా సీఈవో వినీత్ గౌతమ్ మాట్లాడుతూ తమ స్టోర్లలో విక్రయాలు 50 శాతం కంటే తగ్గాయని తెలిపారు.

షాపింగ్ పట్ల విముఖత

మరోవైపు చాలా మంది ఉద్యోగాలను కోల్పోవడం, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఉండటంతో వినియోగదారులు షాపింగ్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అన్ని కేటగిరీ వస్తువు విక్రయాల్లోనూ సగటు కొనుగోళ్లు లేకపోవడం స్పష్టం చేస్తోంది. ‘అవసరమైన, అత్యవసరమైన ఉత్పత్తులను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. విలాసవంతమైన వస్తువుల కొనుగోలును వాయిదా వేస్తున్నారు’ అని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్స్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు, గోద్రేజ్ వ్యాపార సంస్థల అధిపతి కమల్ తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు పూర్తిగా తెరుచోలేదని తెలిపారు. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ పరిశ్రమల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 25 నుంచి 35 శాతం తగ్గాయని ఆయన చెప్పారు.

ఘోరంగా దెబ్బతిన్న డ్రెస్, ఫుట్‌వేర్

కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఘోరంగా దెబ్బతిన్న విభాగాల్లో డ్రెస్ అండ్ ఫుట్ వేర్, బ్యూటీ ఉత్పత్తులు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ గ్రూప్, విజయ్ సేల్స్, గ్రేట్ ఈస్టర్న్ తదితర రిటైల్ స్టోర్లు 35 నుంచి 45 శాతం అమ్మకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో వస్తువుల ధరలో 20 శాతం వరకుతగ్గుదల నమోదవుతున్నట్టు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్ ఖురానా పేర్కొన్నారు. కన్స్యూమర్ ఫైనాన్సింగ్ క్షీణించడమూ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి తగ్గితే రెండో త్రైమాసికం నుంచి విక్రయాలు పుంజుకొనే అవకాశాలు ఉన్నట్టు, అదే సమయంలో పండుగల సీజన్ తమ అమ్మకాలకు అండగా నిలుస్తాయనే భరోసా ఉందని ఇండియాలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ ప్రతినిధి వివరించారు. ఏదిఏమైనా రంజాన్‌కు ముందు కొంత వరకు దుకాణాలను తెరవడం వల్ల చిల్లర వ్యాపారులకు ఉపశమనం కలిగిందని, ఎంతోకొంత వ్యాపారం చేయకలిగారని అరవింద్ ఫ్యాషన్స్ సీఈవో సురేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News