'లా' కోర్సులకు గిరిజన రెసిడెన్షియల్ కాలేజీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలల విధానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కళాశాలకు భారత బార్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించింది. అరవై మంది విద్యార్థులతో కళాశాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా త్వరలో రెండో విడత ప్రారంభం కానున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ హైదారబాద్‌లో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన గుర్తింపు పత్రాలను ఆ కళాశాల అధికారులు మంత్రికి అందజేశారు. గిరిజన […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలల విధానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కళాశాలకు భారత బార్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించింది. అరవై మంది విద్యార్థులతో కళాశాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తొలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా త్వరలో రెండో విడత ప్రారంభం కానున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ హైదారబాద్‌లో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన గుర్తింపు పత్రాలను ఆ కళాశాల అధికారులు మంత్రికి అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే నడుస్తున్న అనేక విద్యా సంస్థలకు అదనంగా న్యాయ కళాశాల కూడా వచ్చి చేరిందని తెలిపారు. ఈ కళాశాల గిరిజన సంక్షేమ శాఖ కింద నడుస్తున్నప్పటికీ గిరిజనేతరులకు కూడా అడ్మిషన్లు పొందే అవకాశం ఉందన్నారు.
మొత్తం అరవై సీట్లలో 39 గిరిజనులు, ఆదివాసీలకు రిజర్వు అవుతాయని, మరో ఆరు సీట్లు దళితులకు, ఇంకో ఏడు సీట్లు ఓబీసీ విద్యార్థులకు, రెండు ఫార్వార్డ్ కులాల విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. రెండు సీట్లను క్రీడా విభాగంలో ప్రతిభ కనబర్చినవారికి మరో రెండు ఎన్‌సీసీ విద్యార్థులకు, ఒక సీటును మాజీ సైనికోద్యోగుల పిల్లలకు రిజర్వు చేసినట్లు తెలిపారు. దివ్యాంగులకు సైతం ఒక సీటును కేటాయించినట్లు తెలిపారు. బార్ కౌన్సిల్ నుంచి వచ్చిన మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లను కేటాయించినట్లు మంత్రి వివరించారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ లా కోర్సును నిర్వహిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా గిరిజనులకు సైనిక్ స్కూలు
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసమే ఒక సైనిక్ స్కూలును ప్రారంభించిందని, కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ శాఖతో సంబంధం లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో నడిచే ఈ సైనిక్ స్కూలు కేవలం గిరిజనుల కోసం మాత్రమేనని, దేశంలోనే ఈ తరహా స్కూలు ఇదే మొట్టమొదటిదని మంత్రి సత్యవతి తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి మంజూరైన సైనిక్ స్కూలుతో సంబంధం లేకుండా ఇది విడిగా పనిచేస్తుందని, ఇందులో అడ్మిషన్లు పొందే విద్యార్థులంతా గిరిజనులు, ఆదివాసీలేనని నొక్కిచెప్పారు. ట్రైబల్ పీజీ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిర్వహించడానికి రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ గిరిజన కళాశాలలు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఒకటి జడ్చర్లలో మరొకటి షాద్‌నగర్‌లో ఉన్నట్లు వివరించారు. జడ్చర్లలో బాలురు మాత్రమే విద్యనభ్యసించే విధంగా 40 సీట్లు ఉంటాయని, షాద్‌నగర్‌లోని కళాశాల మాత్రం కేవలం బాలికలకు మాత్రమేనని, ఇక్కడ కూడా 40 సీట్లు ఉంటాయన్నారు.