ఉపవాసికి ఆనందానికే ఈద్

అతడి ముందు పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. తనకు నచ్చిన ఆహార పదార్థాలున్నాయి. కడుపు నిండా తినాలనుకున్నాడు. అంతలోనే రంజాన్ ఇచ్చిన శిక్షణ జ్ఞప్తికి వచ్చింది.

Update: 2022-05-02 18:30 GMT

తడి ముందు పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. తనకు నచ్చిన ఆహార పదార్థాలున్నాయి. కడుపు నిండా తినాలనుకున్నాడు. అంతలోనే రంజాన్ ఇచ్చిన శిక్షణ జ్ఞప్తికి వచ్చింది. పేదల ఆకలి బాధ గుర్తొచ్చింది. తన పక్కవీధిలో ఫుట్‌పాత్ మీద ఉండే ఓ అభాగ్యుడి ఆకలి తీర్చాడు. తాను మాత్రం మితంగానే తిన్నాడు. విశ్వాసి తన కడుపును మూడు భాగాలు చేస్తాడు. ఒకటి ఆహారం కోసం, ఇంకోటి మంచి నీటి కోసం, మూడోది గాలి కోసం. అతడు రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాడు. పొద్దెక్కేదాకా పడుకోవాలనుకున్నాడు.

రంజాన్ సహెరీ‌లో మేల్కొన్న రోజులు, ఫజర్ నమాజులు గుర్తొచ్చాయి. ఠంచనుగా లేచి కూర్చున్నాడు. నిద్రమత్తును త్యాగం చేసి నమాజు కోసం మజీదుకు బయలుదేరాడు. ఎప్పటినుంచో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు. ఇరు కుటుంబాల మధ్య మాటల్లేవు. జకాత్, సదఖా, ఇఫ్తార్ నేర్పిన త్యాగభావం అతనిలో పరివర్తన తీసుకొచ్చింది. అన్న ప్రేమ కోసం తనకు రావాల్సిన వాటాను కొంచెం వదులుకున్నాడు. అన్న తలుపు తట్టాడు. ప్రేమగా కౌగిలించుకున్నాడు. ఒకరినొకరు క్షమించుకున్నారు.

మానవత్వం వెలిగించి

పొరుగింటి పోరు ఎప్పటినుంచో అతన్ని కుంగదీస్తున్నది. తన పొరుగింటివారిని ఎంతలా వేధించాడో అతనికి అర్థమయ్యింది. రోజా ఇచ్చిన సహనం, ప్రేమ అతనిలో మార్పు తీసుకువచ్చింది. రంజాన్‌లో ఇఫ్తార్ ఇచ్చిపుచ్చుకోవడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. రోజూ ఆఫీసులో అతనికి ఎంత వద్దన్నా అక్రమ సంపాదన తన జేబులోకి వచ్చి చేరుతుంది. ఈసారి రంజాన్ అతనిలో మార్పు తీసుకొచ్చింది. ఉపవాసముండీ 15 గంటల పాటు ఆకలిదప్పులను మానుకున్న తాను మామూలు రోజులలో ఈ అక్రమ, అవినీతి సొమ్ము లేకుండా జీతంతో బతకలేనా? అని గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. దేవుడు నిత్యం మనలను చూస్తున్నాడన్న భావనను ఈ ఉపవాసాలు కల్పించాయి.

ఈ భావన మనిషిని అన్ని రకాల చెడు గుణాల నుంచి రక్షణ కవచంలా కాపాడుతుంది. ఉపవాస కాలంలో ఏవిధంగానైతే ఆకలిదప్పులను సహించి, చుక్క నీరు కూడా మింగకుండా జాగ్రత్తపడ్డాడో అదే విధంగా మిగతా రోజులలోనూ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తపడతాడు.14 గంటలపాటు పస్తులుండటంతో వ్యసనాలను త్యజించవచ్చు. పాన్, గుట్కా, సిగిరెట్ లాంటి వ్యసనాలను మానుకోవచ్చు. ఏ అలవాటైనా కొన్ని గంటలు అదుపు చేసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా మానుకోవచ్చు. మాటల్లో, చేతల్లో పొంతన, నడకలో, నడతలో సమతూకానికి రంజాన్ శిక్షణ రక్షణగా నిలుస్తుంది. ఇదే రంజాన్ ఇచ్చే స్ఫూర్తి.

ప్రతీ ఘడియా ఆనందమే

ఇఫ్తార్ సమయంలో తెలిసినవారైనా, తెలియనివారైనా పంచుకు తినే సమిష్టి తత్వం అలవడుతుంది. తనకు లేకపోయినా ఎదుటివారి కడుపు నింపాలన్న త్యాగ స్ఫూర్తి ఈ ఉపవాసాలు జనింప చేస్తాయి. ఉపవాసాలు అల్లాహ్ కోసమే కాబట్టి వాటి ప్రతిఫలం అల్లాహ్‌యే ఇస్తాడన్న మహోన్నత లక్ష్యంతో వీటిని పాటిస్తారు. ఇఫ్తార్, సహెరీ తినడం, రాత్రి నిద్రలో గడపడం కూడా దైవారాధన తో సమానం. జకాత్ ద్వారా తమ సంపదలోనుంచి రెండున్నర శాతం పేదలకు పంచడం వలన సంపద శుద్ధి అవుతుంది. ఉపవాసాలతో మన ఆత్మ ప్రక్షాళన మవుతుంది. శరీరం పరిశుద్ధమవుతుంది. మనిషి కడుపు నిండా తినరాదని, కనీసం మూడింట ఒక వంతు కడుపు ఖాళీగా ఉండాలని ప్రవక్త బోధించిన మాటలు సమానత్వానికి నిదర్శనాలు మాత్రమే కాదు, సానుభూతిని పెంచే సాధనాలు మాత్రమే కాదు. దేవుడు చూస్తున్నాడన్న బాధ్యతాభావంతో చేసే పనులివి. సంవత్సరమంతా ఈ భావన ఉంటే ఆ సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది? ఇస్లామ్ కోరే సమాజం అలాంటిది.

ఫిత్రా పరమార్థం

ఈదుల్ ఫిత్ర్ నాడు ఏ ఒక్క నిరుపేద, అనాథా చేయిచాచి అడగకూడదని, ఎవరూ కన్నీరు పెట్టుకోరాదని ప్రవక్త (స) ముస్లిములకు పిలుపునిచ్చారు. అదే సందర్భంలో పండుగ సంబరాలు శ్రుతిమించకుండా డాంబికాలకు, డాబుసరికి పోకుండా ఉన్నదాంట్లోనే జరుపుకోవాలనీ సూచించారు. ఈద్ నమాజు కంటే ముందు మరో పని కూడా చేయాల్సి ఉంటుంది. పండుగ సంతోషాలను సమాజంలోని బీదబిక్కికి పంచేందుకు దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీనిని ఇస్లామీ పరిభాషలో ఫిత్రా అంటారు. రంజాన్ పండుగను ఈదుల్ ఫిత్ర్ అంటారు.

ఫిత్రా పేదల హక్కుగా ప్రవక్త నిర్ణయించారు. స్తోమత గల ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని చేయాలి. ఫిత్రా వల్ల పేదసాదులుకు పండుగ అవసరాలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ సామగ్రి కొనుక్కోలేని వారికి ఇది కాస్తంత ఆసరా అవుతుంది. ముందే ఫిత్రాలు ఇచ్చేస్తే వారు కూడా పండుగకు అవసరమైనవి కొనుక్కుని అందరితోపాటు సంతోషంగా నమాజులలో పాల్గొనగలుగుతారు. కిలోన్నర గోధుమలు లేదా బియ్యం, ఖర్జూరాలు లేదా దాని విలువకు సరిపడా డబ్బును అందించాలని ప్రవక్త (స) చెప్పారు.

ముహమ్మద్ ముజాహిద్

96406 22076

Tags:    

Similar News