తమిళనాడును రజనీ దేవుడు కాపాడుతాడా..?
దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే పాలిటిక్స్‌లోకి వస్తా. అయితే రాజకీయాల లోతు తెలిసిన వాణ్ని కాబట్టి. అనేక మంది భుజం మీద భారం మోపాల్సి వస్తుంది కనుక ఆలోచిస్తున్నానంటూ గతంలో కామెంట్స్ చేసిన రజనీ ఇప్పుడు డైరక్ట్‌గా 2021లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానంటూ ప్రకటించారు. మరి 2021 జరిగే ఎన్నికల్లో తమిళనాడును ఏ దేవుడు కాపాడతాడనేది సస్పెన్స్ గా మారింది. తమిళనాడులో సినిమా పాలిటిక్స్ కలిసి […]
దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే పాలిటిక్స్‌లోకి వస్తా. అయితే రాజకీయాల లోతు తెలిసిన వాణ్ని కాబట్టి. అనేక మంది భుజం మీద భారం మోపాల్సి వస్తుంది కనుక ఆలోచిస్తున్నానంటూ గతంలో కామెంట్స్ చేసిన రజనీ ఇప్పుడు డైరక్ట్‌గా 2021లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానంటూ ప్రకటించారు. మరి 2021 జరిగే ఎన్నికల్లో తమిళనాడును ఏ దేవుడు కాపాడతాడనేది సస్పెన్స్ గా మారింది.
తమిళనాడులో సినిమా పాలిటిక్స్ కలిసి నడుస్తుంటాయి. కరుణానిధి మొదలు ..కార్తిక్ వరకు సినిమాల నుంచి వచ్చిన వారే. ఎంజీ రామచంద్రన్, జయలలిత సినీ గ్లామర్‌తో ముఖ్యమంత్రులైన వారే. మరి రజనీకాంత్ సంగతేంటి. గతంలో రజనీ..! జనానికి మంచి చేయాలంటే పాలిటిక్స్ ఒక్కటే కాదు. జనానికి మంచి చేస్తా. జనానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలే చేస్తానని అన్నారు. కానీ ఫ్యాన్స్ వేరే ఆలోచించారు. రాజకీయాల్లోకి రావాలని కోరారు. అందుకు కారణం రజనీకాంత్ చేసిన ఓ కామెంట్. 1996లో రజనీకాంత్ మాట్లాడిన ఒక్కడైలాగ్ తో సీన్ మారింది. ఆ ఎన్నికల ప్రచార సమయంలో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును ఆ భగవంతుడు కూడా కాపాడలేడని అన్నాడు . దీంతో జయలలిత పార్టీ అన్నాడీఎంకే ఓడిపోయి.. డీఎంకే పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల విజయంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు.
అదిగో అప్పటి నుంచి రజనీ రాజకీయ రంగ ప్రవేశం తారాస్థాయికి చేరింది. సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్‌ను బట్టి రజనీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ ఆయన అభిమానులు ఆనందపడేవారు. కానీ మీడియా సమావేశంలో అభిమానుల ఉత్సాహాన్నీ నీరుగారుస్తూ ఓ నవ్వు నవ్వి వదిలేసేవారు. అయితే 2014 లింగా ఆడియో ఫంక్షన్‌లో తలైవా రాజకీయం రంగప్రవేశంపై స్పందించారు. పరిస్థితులు అనుకూలిస్తే పాలిటిక్స్ లోకి వస్తానని ప్రకటించారు.
ద్రవిడ భావజాలం ఇప్పటికీ గట్టిగా ఉన్న తమిళనాట బీజేపీ పప్పులు ఉడక్కపోవడంతో…, ఆధ్యాత్మికగా రాజకీయాలు చేసే రజనీని తమ పార్టీలోకి చేర్చుకోవాలని గట్టిప్రయత్నాలు చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికల విజయంతో తమిళనాడులో పాగావేయాలని బీజేపీ హైకమాండ్ సంప్రదింపులు జరిపింది కానీ అందుకు రజనీ ఒప్పుకోలేదు. తాజాగా ఆయన రాజకీయ రంగప్రవేశంపై స్పందించడంతో..,ఇప్పటికే దక్షిణాది తెలంగాణ పాలిటిక్స్‌పై కన్నేసిన బీజేపీకి రజనీ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. 2021 ఎన్నికల్లో రజనీ కాంత్ తో పొత్తపెట్టుకొని అన్నాడీఎంకేను అక్కున చేర్చుకోవాలని కమలం నేతల ప్లాన్. దీనికి తోడు రజనీ ఆధ్యాత్మికత కలిసొచ్చే అంశమే.
రజనీ పొలిటికల్ ఎంట్రీపై అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు. రజనీతో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నాడీఎంకేను బీజేపీ వాళ్లే ఢిల్లీ నుంచి నడిపిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి.. రజనీకాంత్‌ను ముందు పెట్టి.. వెనుకవైపు తాముండి.. పల్లకిని అన్నాడీఎంకే కార్యకర్తలతో మోయించాలనేది బీజేపీ వ్యూహం అనేది మరోవాదన.
దీంతో తమిళనాట రాజకీయాలంటే ఏవగించుకునే వారు సైతం 2021 జరిగే ఎన్నికల్లో తమిళనాడును రజనీ దేవుడు కాపాడుతాడా..? అంటూ గుసగుసలాడుకుంటున్నారు.