నాదల్ కల తీరేనా?
దిశ, స్పోర్ట్స్ : సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫిబ్రవరి 8 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షల మధ్యన జరుగనున్న ఈ టోర్నీలో అందరి చూపు రఫెల్ నాదల్ పైనే ఉన్నది. మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల డబుల్స్ వంటి పోటీలు ఉన్నా.. టెన్నిస్ అభిమానులు మాత్రం మెన్స్ సింగిల్స్ పైనే దృష్టి పెట్టనున్నారు. ఈ సారి పోటీ మొత్తం వరల్డ్ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్, వరల్డ్ […]
దిశ, స్పోర్ట్స్ : సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫిబ్రవరి 8 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. కరోనా ఆంక్షల మధ్యన జరుగనున్న ఈ టోర్నీలో అందరి చూపు రఫెల్ నాదల్ పైనే ఉన్నది. మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల డబుల్స్ వంటి పోటీలు ఉన్నా.. టెన్నిస్ అభిమానులు మాత్రం మెన్స్ సింగిల్స్ పైనే దృష్టి పెట్టనున్నారు. ఈ సారి పోటీ మొత్తం వరల్డ్ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్, వరల్డ్ నెంబర్ 2 రఫేల్ నాదల్ మధ్యనే ఉండనున్నది. రఫేల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను చివరి సారిగా 2009లో గెల్చుకున్నాడు. ఆ తర్వాత రెండు సార్లు ఫైనల్‌కు చేరినా ఒకసారి ఫెదరర్‌పై, మరోసారి జకోవిచ్‌పై ఓడిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో చెలరేగిపోయే రఫా.. ఈ హార్డ్ కోర్టులో మాత్రం చతికిలపడిపోతున్నాడు. అయితే ఈ సారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడం ద్వారా రెండు కోరికలను తీర్చుకోవాలని రఫా భావిస్తున్నాడు.
ఫెదరర్ ఆడటం లేదు..
దిగ్గజ టెన్నిస్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టి చాలా నెలలైంది. కరోనాకు ముందు మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆటకు దూరమ్యాడు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జరిగినా ఫెదరర్ మాత్రం ఆడటానికి ఇష్టపడలేదు. ఒకవైపు కరోనా, మరోవైపు మోకాలి చికిత్స నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో ఫ్రెంచ్ ఓపెన్ ఆడిన రఫా.. అక్కడ విజేతగా నిలిచాడు. దీంతో కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టోర్నీలు గెల్చిన ఆటగాడిగా రోజర్ ఫెదరర్ సరసన చేరాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెదరర్ ఆడటం లేదు కాబట్టి.. రఫెల్ నాదల్‌కు కలసి వచ్చే అవకాశం ఉన్నది. యూఎస్ ఓపెన్ నుంచి జకోవిచ్ నిషేధానికి గురి కావడం.. ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోవిచ్ ఫైనల్లో రఫాతో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రఫానే ఫేవరెట్‌గా మారాడు.
రికార్డు సృష్టిస్తాడా?
ఆల్ టైం గ్రాండ్‌స్లామ్ రికార్డుల్లో రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్‌తో సమానంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించడానికి రఫెల్ వద్ద మంచి అవకాశం ఉన్నది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ద్వారా 21 గ్రాండ్స్‌స్లామ్స్‌తో అగ్రస్థానానికి చేరుకుంటాడు. అదే సమయంలో నాదల్ 12 ఏళ్లగా దక్కని ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాననే సంతృప్తి మిగులుతుంది. నాదల్ 2009లో విజేతగా నిలిచిన తర్వాత 2012లో ఫైనల్ చేరుకున్నాడు. కానీ జకోవిచ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2017లో ఫైనల్ చేరుకొని రోజర్ ఫెదరర్ చేతిలో ఓడిపోయాడు. చివరి సారిగా 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన నాదల్.. జకోవిచ్ చేతిలో మరోసారి ఓడిపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా తన కలను తీర్చుకోవాలని.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. గ్రాండ్‌స్లామ్ రికార్డుతో పాటు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఉన్న చెత్త రికార్డును కూడా తుడిచిపెట్టేయాలని భావిస్తున్నాడు. రఫా అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.