షర్మిల పగటి వేషానికి ఫలితమెంత?
దిశ, పబ్లిక్‌పల్స్: తెలంగాణాలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటున్న సందర్భం ఎందుకో పగటివేషగాళ్లను గుర్తు చేస్తోంది. పగటి వేళనే కృష్ణుడు, రాముడు, హనుమంతుడి వేషం కట్టి కొందరు వీధులలో తిరుగుతూ ఉంటారు. సమయం, సందర్భం లేకుండా ఒకరి ప్రమేయం, ఒకరికి అవసరం లేకున్నా వస్తూనే ఉంటారు. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కరలేని మహిళ షర్మిల. 2021 ఆరంభంలో ఆమె తెలంగాణాలో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించడం ఓ వింతైన వార్తలా విస్తరించింది. టీఆర్ఎస్ పాలన […]
దిశ, పబ్లిక్‌పల్స్: తెలంగాణాలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటున్న సందర్భం ఎందుకో పగటివేషగాళ్లను గుర్తు చేస్తోంది. పగటి వేళనే కృష్ణుడు, రాముడు, హనుమంతుడి వేషం కట్టి కొందరు వీధులలో తిరుగుతూ ఉంటారు. సమయం, సందర్భం లేకుండా ఒకరి ప్రమేయం, ఒకరికి అవసరం లేకున్నా వస్తూనే ఉంటారు. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కరలేని మహిళ షర్మిల. 2021 ఆరంభంలో ఆమె తెలంగాణాలో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించడం ఓ వింతైన వార్తలా విస్తరించింది. టీఆర్ఎస్ పాలన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని, తాను ‘రాజన్న రాజ్యం ‘ ద్వారా తన తండ్రి తీరు పాలనను అందిస్తాననే ఏకైక నినాదంతో ఈ నేలపై అడుగు పెట్టారు. ఇది ఒక రకంగా పిలవని పేరంటానికి వచ్చిన చందమే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన స్థితిని, తెలంగాణాలో ‘రెడ్డి’ జనాభాను చూసి తనకేమైనా ఇక్కడి రాజకీయ మైదానంలో చోటు దొరకవచ్చనే అంచనాతో ఆమె వచ్చినట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
జనాకర్షణ ఉన్నా
మొదటలో షర్మిల రాక వెనుక టీఆర్ఎస్ హస్తముందా? బీజేపీకి లోపాయకారి బంధమా? అని మీడియా తర్జనభర్జనపడింది. ఈ చర్చ ఆమెకు మంచి ప్రచారాన్ని కూడబెట్టిందనవచ్చు. స్వతహాగా ఆమెకున్న ప్రజా పరిచయం, మాట తీరు, చొరవ, ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీసే విధానం జనాకర్షణగా నిలిచి తరచుగా ఆమె వార్తలలో కనబడేలా చేశాయి. షర్మిల అంటున్నట్లు ఆమె మెట్టినిల్లు తెలంగాణయే. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆయుర్వేద వైద్యుడు ఎం.రమణారావు ఆమె మామగారు. వారిది బ్రాహ్మణ కుటుంబం. వారి పెద్ద కుమారుడే షర్మిల భర్త బ్రదర్ అనిల్. ఆయన క్రైస్తవ మత ప్రభోధకుడు, వ్యాపారవేత్త. దీనికి తోడు ఆమెకు హైదరాబాద్‌లో ఇతర స్థిరాస్తులు కూడా ఉన్నాయంటారు. సుదీర్ఘ కాలం రాజకీయ ప్రముఖుడిగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి కూతురుగా, ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా షర్మిలకు రాజకీయాలలో పాఠాలు స్వతహాగా అబ్బి ఉంటాయి. సామాజికంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ఆమెకు తెలిసింది కూడా రాజకీయరంగమే. 2012, 2013 నుండి అన్న జగన్మోహన్‌రెడ్డికి వెన్నంటి నిలిచి పాదయాత్రలో తోడుగా ఉంది. జగన్ జైలులో ఉన్న రోజులలో ప్రజలలోకొచ్చి జనాకర్షణ నినాదంగా ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అనేవారు. 2019 లో జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే ఆమెకు కావలసినంత తీరిక దొరికింది. అంతా తెలిసిన విద్యనే. తెలంగాణ పరిచయమున్న పక్క తెలుగు రాష్ట్రం. తండ్రిని ఎరిగిన మనుషులు ఉన్నారక్కడ. ఇన్ని అనుకూలతలు వాడుకొని ఒక ప్రయత్నం చేసి చూద్దామనే ప్రణాళికతోనే ఆమె వచ్చారనిపిస్తుంది.
దుకాణం తెరిచినట్టు
వ్యాపారవేత్తలు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో తమ కేంద్రాన్ని తెరుస్తారు. నడిస్తే లాభమే. లేదంటే నాలుగు నెలలు చూసి మూసేస్తారు. దాని వల్ల సంస్థ పెద్దగా కోల్పోయేదేమి ఉండదు. ఇలా ప్రయత్నాలు చేపట్టకపోతే వ్యాపారం ఎదుగదు. అదో వ్యాపార సూత్రం. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే రాజకీయ పార్టీలు అంతే. ఈ రోజులలో దక్షిణాది సినిమా నటులు చేస్తున్న రాజకీయ అరంగేట్రాలు అన్నీ పై మాటలకు సరిగ్గా సరిపోతాయి. తెలంగాణ సాధన తర్వాత ఇక్కడి ప్రజల అంచనాలు వేరుగా ఉన్నాయి. స్వీయపాలనపై విశ్వాసం ఉంది. దాని మాధుర్యాన్ని ఇంకా కడుపారా ఆస్వాదించనే లేదు. తిట్టినా, పెట్టినా మావాడే కావాలనే సెంటిమెంట్ ఉంది. ఆంధ్రులపై, ఆంధ్రప్రదేశ్‌పై మనోక్లేశమింకా తొలిగిపోనేలేదు. నమ్మి రాజ్యం వారి చేతిలో పెట్టే అవకాశమే లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ఎన్నికల హామీలను మరచినట్లుగా టీఆర్ఎస్ పాలన ఉన్నా యుద్ధం ఈ నేల పుత్రుల మధ్యనే సాగుతుంది కానీ, పరాయి మనుషులకు చోటు ఉండదు. అయితే, షర్మిలది తెలిసి చేస్తున్న ప్రయత్నమే అనుకోవాలి. పార్టీ స్థాపనకు ముందుకొచ్చిన ఆమె ఇప్పటి వరకు అందులో ఎలాంటి పదవిని స్వీకరించలేదు. ఎలక్షన్ కమిషన్‌కు పార్టీ పేరు నమోదు కోసం షర్మిల కాకుండా హైదరాబాద్‌కు చెందిన వాడుక రాజగోపాల్ అభ్యర్థన పంపారు. పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఖాయమైనట్లే. రాజశేఖరరెడ్డి జన్మదినమైన జులై ఎనిమిదిన పార్టీ స్థాపన, జెండాఆవిష్కరణ జరుగుతుందని అంటున్నారు.
మారుతున్న పరిణామాలు
రాజశేఖర్‌రెడ్డి భార్య విజయమ్మ భర్త బతికున్న రోజులలో ప్రజల ముందుకు వచ్చిన మనిషి కాదు. ఆమెను తెలంగాణాలో ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. ఏప్రిల్ తొమ్మదిన ఖమ్మంలో జరిగిన సభలో విజయమ్మ కూతురు పక్కనే కూచుంది. తన బిడ్డను దీవించమని ప్రజలను కోరింది. ఆమెది అచ్చు కడప భాష. జన స్పందన కనబడలేదు. అందరి చూపులు షర్మిలపైనే. ఆమె హావభావాలు, ఎంచుకున్న పదాల విరుపుల భాష, ముఖం నిండా విప్పారే నవ్వు యువతను ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఇపుడైతే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి గెలుపును అందుకోలేనంత దూరంలో కనబడుతోంది. బీజేపీ వైపు పట్టణ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం పాలన ప్రణాళికాబద్ధంగా సాగడం లేదు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. ఇచ్చిన గడువులు దాటిపోతున్నాయి. తరచూ ఎన్నికల రాకతో రాజకీయవ్యూహాలతోనే కాలం గడుస్తోంది. పాలనలో సమతుల్యత కొరవడింది. మంచి సమయం మించిన దొరకదన్నట్లు షర్మిల రాజకీయ రంగ ప్రవేశానికి సిద్దపడుతున్నారు. ఆమె తెలంగాణాలో కాలు పెట్టిన నాటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ లో లేవు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో ఇక్కడ కొంత హడావుడి మొదలైంది. ఈ మధ్యకాలంలో ప్రజలకు ఇంతగా తెలిసిన కాంగ్రెస్ నేత ఈయనే. పైగా సూటిపోటి మాటకారి. రేవంత్ కొత్త బాధ్యతను ఛాలెంజిగా తీసుకొని దూకుడుగా ఉన్నాడు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ఏ మలుపైనా తిరుగవచ్చు. కొత్త గాలి వల్ల కాంగ్రెస్ కొంతైన బలపడే అవకాశముంది. ఈ రకంగా కాంగ్రెస్ వల్ల ఏర్పడ్డ ఖాళీని మళ్ళీ కాంగ్రెస్ యే పూరించే అవకాశమున్నందున షర్మిల ఒక ఆశను వదులుకోవలసిందే.
బ్రాండ్ నేమ్ పని చేయదు
షర్మిల తన పార్టీ సిద్ధాంతంగా ప్రవచిస్తున్న ‘రాజన్న రాజ్యం’ అంటే ఏమిటో, ఆ మాటకు తెలంగాణాలో ఉన్న విలువేమిటో ఆమెకే తెలియాలి. ప్రస్తుతం ఎవరీ రాజన్న అనే స్థితిలో తెలంగాణ ప్రజానీకం ఉంది. ఆ బ్రాండ్ నేమ్‌తో సరుకు అమ్ముడుబోయే రోజులు కావివి. రాజశేఖరరెడ్డి అకాల మరణాంతరం క్రమంగా ఆయన ప్రతిష్ట మసకబారింది. ఆయన పాలన కాలంనాటి అవినీతి ఆరోపణలపై జగన్ జైలుకెళ్లవలసి వచ్చింది. అందరు ముఖ్యమంత్రుల్లా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కొంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారని తప్ప పెద్ద విశేషాలేవీ ఇక్కడి ప్రజల మనసులో లేవు. ఇక్కడ జగన్ ఓదార్పులు అవసరం పడలేదు. షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పెట్టినా, షర్మిల టీపీ అని పెట్టినా పెద్ద భేదమేమి ఉండదు. రాబోయే రోజుల బహిరంగ సభలలో తన తండ్రి తెలంగాణ కోసం ప్రత్యేకంగా చేసిన పనులివి చెప్పడానికి ఏమీలేకపోగా, ఆయన తెలంగాణ వ్యతిరేకి అనడానికి సాక్ష్యాలున్నాయి. ఇపుడైతే ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటమే మిగిలింది. వీటి మధ్య ఏ కొత్తపార్టీ వచ్చినా.. ఢీకొంటున్న పశువుల మధ్యకు లేగదూడలు వచ్చినట్లే ఉంటుంది తప్ప ఆశించిన ప్రయోజనం దక్కదు. -బి.నర్సన్ 9440128169