తాగి తందనాలు.. ‘పబ్’కు వందనాలు!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పబ్ కల్చర్ హద్దు మీరుతోంది. పాశ్చాత్య సంస్కృతి మోజులో యువత పక్కదారులు తొక్కుతోంది. వీకెండ్స్ అనే కాదు.. ప్రతీ రోజు పబ్‌ల్లో మందు, చిందేయడమే కాక.. మత్తులో శృతిమించిన సరదాలను కోరుకుంటోంది యువత. పబ్‌లోకి వెళ్లగానే ఆ అట్మాస్పియర్ ప్రభావంతో మినిమమ్ కామన్ సెన్స్‌ను మరిచిపోతున్నారు. మత్తులో సహనం కోల్పోయి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు మత్తులో ఉండటం ఘర్షణను మరింత పెద్దది చేస్తుందే […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పబ్ కల్చర్ హద్దు మీరుతోంది. పాశ్చాత్య సంస్కృతి మోజులో యువత పక్కదారులు తొక్కుతోంది. వీకెండ్స్ అనే కాదు.. ప్రతీ రోజు పబ్‌ల్లో మందు, చిందేయడమే కాక.. మత్తులో శృతిమించిన సరదాలను కోరుకుంటోంది యువత. పబ్‌లోకి వెళ్లగానే ఆ అట్మాస్పియర్ ప్రభావంతో మినిమమ్ కామన్ సెన్స్‌ను మరిచిపోతున్నారు. మత్తులో సహనం కోల్పోయి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు మత్తులో ఉండటం ఘర్షణను మరింత పెద్దది చేస్తుందే తప్ప.. కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. మరి పబ్ యాజమాన్యం గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నిస్తుందా అంటే అదీ లేదు. వచ్చారు.. తాగారు.. తన్నుకున్నారు.. మాకేంట్రా బాబు.. మా పనేదే మేం చూసుకుంటాం అన్నట్లే ఉంటోంది వారి యవ్వారం !
ఇలాంటి పరిస్థితుల్లో జరిగిందే టాలీవుడ్ సింగర్ ‘రాహుల్ సిప్లిగంజ్’పై దాడి. అమ్మాయిలతో పబ్‌కు వచ్చిన రాహుల్.. తనతో వచ్చిన ఆడపిల్లలను ఎందుకు కామెంట్ చేస్తున్నారని అడిగితేనే.. బీరు సీసాలతో బాదేశారు. చనిపోతాడనే ఆలోచనే లేకుండా సహనం కోల్పోయి ప్రవర్తించారు. అదృష్టం బాగుండి ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడిన రాహుల్.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డి గ్యాంగ్ అని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేశాడు. ఇంతకు ముందు కూడా రితేశ్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఓ హీరోయిన్‌ను ఇలాగే ఇబ్బంది పెట్టారని కూడా తెలుస్తున్నది. కానీ.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవడం, మళ్లీ గొడవలు పడటం వాళ్లకు కామన్ అయిపోయింది. అంతేకాదు పొలిటికల్ డీల్స్ కూడా పబ్ కేంద్రంగా జరుగుతున్నాయనేది వాస్తవం.
కానీ.. రాహుల్‌పై పబ్‌లో దాడి జరిగింది అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో. నిబంధనల ప్రకారంగా పబ్ రాత్రి 11 గంటలకే మూతపడాలి. కానీ.. అప్పటి వరకు ఎందుకు ఇంకా ఓపెన్‌గా ఉందనేది ప్రశ్న. అయితే రాత్రి ఒంటిగంటే కాదు ఉదయం 4 గంటల వరకు కూడా పబ్‌లు నడుస్తున్నాయనేది సామాన్య జనం చెప్తున్న వాస్తవం. అసలు కొన్ని పబ్‌లు అయితే ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు యువతను చెడగొట్టే పనిలో బిజీగా ఉన్నాయి. పైగా ఎంట్రీ ఫర్ కపుల్స్ బోర్డులు, రాయితీలు యంగ్ జనరేషన్‌ను ఆకర్షిస్తున్నాయి. ‘మీరు అమ్మాయిలతో గడపాలనుకుంటున్నారా.. నో ప్రాబ్లమ్.. మేం అరేంజ్ చేస్తాం..’ అంటూ ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి మరీ.. మీరు చెడిపోవడమే మాకు కావాలన్న రీతిలో ప్రోత్సహిస్తున్నాయి. మైనర్లను కూడా వదలడం లేదంటే పరిస్థితి ఎంతలా చేజారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 21 ఏళ్లు దాటితేనే పబ్‌లోకి అనుమతించాలి. కానీ మాకు బిజినెస్ జరగాలి అంతే.. వాడు మైనర్ అయితే ఏంటి? మేజర్ అయితే ఏంటి? అన్నట్లుగానే ఉంది పబ్ నిర్వాహకుల తీరు. ఇంత జరుగుతున్నా ఈ చీకటి దందాల గురించి అడిగే నాథుడు లేడు. కేవలం ఎక్సైజ్ శాఖ అనుమతితో పబ్ పెట్టేసుకుని నడిపిస్తున్న యాజమాన్యాలు.. పబ్‌లో డీజే ఏర్పాటు గురించి పోలీసుల అనుమతులు పొందుతున్నారా? అంటే అదీ లేదు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం ట్రాఫిక్ పోలీసుల అనుమతి తీసుకుని పోలీసులతో సంబంధం లేకుండా లోపల ఎలాంటి దిక్కుమాలిన పనులు చేయాలనుకుంటున్నారో అంతా చేసేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా పోలీసులకు సమాచారం ఉన్నా నోరు మెదపరు. కారణం మామూళ్లతో ఆల్రెడీ అధికారుల చేయి తడిసిపోతోంది కదా. అలాంటప్పుడు వాళ్లు మాత్రం ఏం మాట్లాడతారు పాపం !