ప్రైవేటు ఆస్పత్రుల అసంతృప్తి.. థర్డ్ వేవ్ ముందు సర్కారుకు సవాళ్ళు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా చికిత్సకు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై యాజమాన్యాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వం ఖరారు చేసిన ఛార్జీలు సహేతుకం కాదని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయణం తీసుకున్నదని పలు ఆస్పత్రుల యజమానులు ఆరోపించారు. జీవోను సవరించాల్సిందేనని, ఖరారు చేసిన ధరల పట్టికలో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల సంఘం గురువారం మీటింగ్ కానున్నది. తీర్మానాలను ప్రభుత్వం […]

Update: 2021-06-23 22:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా చికిత్సకు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోపై యాజమాన్యాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ప్రభుత్వం ఖరారు చేసిన ఛార్జీలు సహేతుకం కాదని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయణం తీసుకున్నదని పలు ఆస్పత్రుల యజమానులు ఆరోపించారు. జీవోను సవరించాల్సిందేనని, ఖరారు చేసిన ధరల పట్టికలో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల సంఘం గురువారం మీటింగ్ కానున్నది. తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నది. ఛార్జీలను పెంచుకుంటే పేషెంట్లకు వైద్యచికిత్సలు అందించడం కష్టమేనని నొక్కిచెప్పింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నది.

కరోనాను కట్టడి చేయడం కేవలం ప్రభుత్వ ఆస్పత్రులతో సాధ్యం కాదనే ఉద్దేశంతో ప్రైవేటు ఆస్పత్రుల సహకారాన్ని కోరిందని, నిర్దిష్టంగా కొన్ని బెడ్‌లను పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించడానికి రిజర్వు చేయాల్సిందిగా ఆదేశించిందని, సానుకూలంగా స్పందించామని, కానీ ఆ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్‌ను, రెమిడెసివిర్ లాంటి మందులను ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించిందని పలువురు డాక్టర్లు వాపోయారు. కరోనాను సాకుగా చూపి ఉత్పత్తి సంస్థలు మాస్కు, పీపీఈ కిట్ మొదలు ఆక్సిజన్, మందులు, వైద్య ఉపకరణాల రేట్లను పెంచాయని, ట్రీట్‌మెంట్ కాస్ట్ పెరిగిపోయిందని, కానీ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ధరలను నిర్ణయించడం వాస్తవికతకు తగినట్లుగా లేదని ఆరోపించారు.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తగిన అనుభవం లేకపోయినా సెకండ్ వేవ్ నాటికి ప్రైవేటు ఆస్పత్రులకు ఆచరణాత్మక ఇబ్బందులు అవగతమయ్యాయని, దాదాపు సగం మంది పేషెంట్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందారని, ఈ వాస్తవాన్ని గమనంలో ఉంచుకునే తాజాగా ప్రభుత్వ అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా గతేడాది జీవోను సవరించాల్సిందిగా విజ్ఞప్తి చేశామని, అధికారుల సూచన మేరకు ఏయే వార్డుల్లో ఏ చికిత్సకు ఎంత ఖర్చవుతుందో, ఏ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌కు ఎంత అవసరమవుతుందో లిఖితపూర్వకంగా సమర్పించామని, కానీ తమ అభిప్రాయాలు జీవోలో ప్రతిబింబించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్స అందించడం సాధ్యం కాదని, సవరణలపై అధికారికంగా తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తమ వైఖరిని వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఖరారు చేసిన ధరలనే అమలుచేయాల్సి వస్తే ఆస్పత్రులకు నిర్వహణ భారం పెరిగిపోతుందని, వీటిని భరించే స్థోమత లేక బెడ్‌లను ఖాళీగా ఉంచుకోవడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా వైద్య చికిత్స ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆక్సిజన్, మందుల లాంటివాటిని ప్రభుత్వమే సమకూర్చే బాధ్యతను తీసుకోవాలని సూచిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి కూడా ప్రభుత్వం థర్డ్ వేవ్ కోసం ప్రాక్టికల్‌గా ఆలోచించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావుకు సమర్పించిన విజ్ఞాపన పత్రాన్ని ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి చదివి ’న్యాయమైన అంశాలే’ అంటూ వ్యాఖ్యానించారని, కానీ చివరకు వాటిని విశ్వాసంలోకి తీసుకోలేదని గుర్తుచేశారు. ఇదే ట్రెండ్ ఇకపైన కూడా కొనసాగితే చాలా ప్రైవేటు ఆస్పత్రులు అమ్మకానికి సిద్ధమవుతాయని, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రమే మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సను సాకుగా తీసుకుని భారీ స్థాయిలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న సమయంలో ఆచరణాత్మక అంశాలను వివరిస్తూ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావడం గమనార్హం. అటు ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్లను పరిష్కరించడం, ఇటు కరోనా ట్రీట్‌మెంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు ఒక్కొక్కరికి సగటున మూడు లక్షల రూపాయలు ఖర్చవుతున్నదంటూ గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రైవేటు డాక్టర్లు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఇంత ఖర్చయినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు ఇంత తక్కువ ధరలను ఖరారు చేయడం సమంజసమేనా అనేది ఇప్పుడు వారు లేవనెత్తుతున్న వాదన.

నిర్వహణా ఖర్చులు పెరిగాయి : డాక్టర్ కిషన్ రావు, తెలంగాణ నర్సింగ్ హోమ్స్, ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు

“రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో విడుదల చేయడానికి రెండు వారాల ముందే మాతో చర్చలు జరిగాయి. లిఖితపూర్వకంగా మా సమస్యలను వివరించాం. అభిప్రాయాలనూ తెలియజేశాం. ఏయే వార్డులో ఎంత ఖర్చు అవుతుందో లెక్కలను చెప్పాం. ఎంత ఖరారు చేయాలని కోరుకుంటున్నామో తెలియజేశాం. మేం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాం. సిబ్బందికి జీతాలు పెరిగాయి. వైద్య ఉపకరణాల ధరలు పెరిగాయి. నిర్వహణా భారం పెరిగింది. సిబ్బందికి వచ్చే ఇన్‌ఫెక్షన్‌తో స్వంత మెడికల్ కాస్ట్ కూడా పెరిగింది. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఒక పేషెంట్‌కు ఏ వార్డులో ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చవుతుందో వివరించాం. కానీ మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ ధరలకు ట్రీట్‌‌మెంట్ ఇవ్వడం ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది’’.

ఇతర రాష్ట్రాల్లాగా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి : డాక్టర్ నర్సింగ్ రెడ్డి, ఐఎంఏ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు

“కరోనా కట్టడిలో ప్రైవేటు ఆస్పత్రుల పాత్ర ఏ మేరకు ఉందో ప్రభుత్వానికి తెలుసు. వాటి సహకారం లేకుండా ఆశించిన ఫలితాలు రావని కూడా తెలుసు. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి వివరించాం. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్‌ల ఆక్సిజన్, మెడిసిన్ లాంటి అవసరాలను ప్రభుత్వాలే చూసుకున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నది. ప్రైవేటు ఆస్పత్రులను ప్రజల్లో దోషిగా చూపెట్టే ప్రయత్నమే ఇది. ఆంబులెన్సుకు వెంటిలేటర్ సౌకర్యం ఉంటే ఒక కి.మీ.కు రూ. 125 చొప్పున నిర్ణయించింది. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఒక పేషెంట్‌కు మూడు గంటల అవసరానికి రూ. 45 వేల వరకు ఖర్చవుతున్నది. కానీ ఒక రోజు మొత్తానికి ఐసీయూ వార్డులో ట్రీట్‌మెంట్‌కు ఖరారు చేసిన ధర మాత్రం కేవలం రూ. 9,000. కోట్ల రూపాయల పెట్టుబడిన పెట్టిన ఆస్పత్రులను ఇది అవమానించడమే. అందువల్ల జీవోలో పేర్కొన్న ధరలను సవరించాల్సిందే”.

లాభం లేకపోగా ఎదురు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది : డాక్టర్ ప్రవీణ్, హాస్పిటల్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు

“ప్రైవేటు ఆస్పత్రుల సేవలను వినియోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిపట్ల ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. పేషెంట్లకు ప్రైవేటు డాక్టర్ల పట్ల విశ్వాసం సన్నగిల్లే అవకాశాలను సృష్టించడమే. లాభాలు లేకపోయినా పర్వాలేదు. కానీ ఎదురు ఖర్చు చేయాల్సి రావడం అర్థరహితం. ఒక పేషెంట్‌కు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ కోసమే రోజుకు సగటున రూ. 20,000 ఖర్చవుతున్నది. కానీ ప్రభుత్వం రూ. 9,000 ఖరారు చేసింది. గతేడాదితో పోలిస్తే ఆక్సిజన్ ధర ఐదారు రెట్లు పెరిగింది. కాస్ట్ టు కాస్ట్ ప్రకారం లెక్కలేసి కనీసంగా పన్నెండు శాతం ప్రాఫిట్ ఉండడాన్ని ప్రభుత్వమే ఆమోదించింది. ఐసీయూ వార్డులో ఒక్కో పేషెంట్‌కు ఒక స్టాఫ్ నర్సును కేటాయించాల్సి వస్తున్నది. స్పెషలిస్టు డాక్టర్లనూ ఉంచాల్సి వస్తున్నది. సగటున రూ. 35 వేలు ఒక్కో పేషెంట్‌కు ఖర్చవుతున్నది. ప్రభుత్వానికి ఈ లెక్కలన్నింటినీ రాతపూర్వకంగా ఇచ్చినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం విస్మయం కలిగించింది’’.

Tags:    

Similar News