ముంచుకొస్తున్న తుఫాన్.. ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తుఫానుగా పరిణమించి బుధవారం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలను దాటనుంది. తౌక్టే తుఫాను కంటే అధిక తీవ్రతను కలిగి ఉండనుందన్న అభిప్రాయాలున్న ఈ యాస్ తుఫాన్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంలో పనిచేయాలని సూచించారు. తీరప్రాంతాల్లో తుఫానుకు ప్రభావితమయ్యే ప్రాంతాల నుంచి ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సముద్ర తీరాల్లో పనిచేసే […]
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తుఫానుగా పరిణమించి బుధవారం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలను దాటనుంది. తౌక్టే తుఫాను కంటే అధిక తీవ్రతను కలిగి ఉండనుందన్న అభిప్రాయాలున్న ఈ యాస్ తుఫాన్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంలో పనిచేయాలని సూచించారు. తీరప్రాంతాల్లో తుఫానుకు ప్రభావితమయ్యే ప్రాంతాల నుంచి ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సముద్ర తీరాల్లో పనిచేసే వారినీ సకాలంలో రెస్క్యూ చేయాలని అన్నారు.
విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ సేవలపై తుఫాను ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, డ్యామేజీని స్వల్ప సమయంలోనే సరిచేయాలని తెలిపారు. కొవిడ్ ట్రీట్‌మెంట్‌కు, వ్యాక్సినేషన్‌కు అంతరాయం కలుగకుండా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సరైన ప్రణాళికలు వేయాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏమి చేయాలి? ఏమి చేయరాదు? వంటి మార్గదర్శకాలను పౌరులకు అర్థమయ్యేలా స్థానిక భాషల్లో విడుదల చేయాలని ఇప్పటికే ఆదేశించామని ప్రధాని వివరించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధులు, టెలికాం, పవర్, సివిల్ ఏవియేషన్, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ రివ్యూ మీటింగ్‌కు హాజరయ్యారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో కేంద్ర హోం శాఖ టచ్‌లో ఉన్నదని, నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నదని ఓ ప్రకటన తెలిపింది. ఇప్పటికే ఎస్‌డీఆర్ఎఫ్ తొలి విడతను అన్ని రాష్ట్రాలకు విడుదల చేసినట్టు పేర్కొంది. తుఫాను సహాయక చర్యలకు 46 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించింది. పడవలు, ట్రీ కట్టర్స్, టెలికాం ఎక్విప్‌మెంట్లతో సంసిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 13 బృందాలను ఆదివారమే తీరప్రాంతానికి పంపిస్తున్నట్టు పీఎంవో తెలిపింది. వీరికితోడు కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది పడవలు, హెలికాప్టర్‌లతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఉంది.