టీకా అభివృద్ధిని సమీక్షించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు టీకా అభివృద్ధి చేస్తున్న మూడు ప్రధాన ఫార్మా సంస్థలను పీఎం మోడీ శనివారం సందర్శించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని జైదుస్ కాడిలాలో మొదలైన ప్రధాని పర్యటన హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ మీదుగా సాగి మహారాష్ట్రలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ముగిసింది. అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని జైదుస్ కాడిలా దేశీయంగా కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ ఫార్మా సంస్థలో పీపీఈ కిట్ ధరించి ప్రధాని టీకా అభివృద్ధి చేస్తున్న తీరును పరిశీలించారు. […]
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు టీకా అభివృద్ధి చేస్తున్న మూడు ప్రధాన ఫార్మా సంస్థలను పీఎం మోడీ శనివారం సందర్శించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని జైదుస్ కాడిలాలో మొదలైన ప్రధాని పర్యటన హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ మీదుగా సాగి మహారాష్ట్రలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ముగిసింది. అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని జైదుస్ కాడిలా దేశీయంగా కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ ఫార్మా సంస్థలో పీపీఈ కిట్ ధరించి ప్రధాని టీకా అభివృద్ధి చేస్తున్న తీరును పరిశీలించారు. శాస్త్రజ్ఞులతో నేరుగా మాట్లాడారు. తొలి దశ ట్రయల్స్ ముగించుకున్న జైదుస్ టీకా ఆగస్టులో రెండో దశ ట్రయల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక్కడ సుమారు గంటపాటు గడిపిన అనంతరం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు ప్రయాణమయ్యారు. హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ల్యాండ్ అయిన పీఎం రోడ్డు మార్గాన కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటక్ ప్లాంట్‌కు వెళ్లారు.
కోవాగ్జిన్ పురోగతిని పరిశీలించిన ప్రధాని, భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల, శాస్త్రజ్ఞులు, ఇతర సీనియర్ అధికారులతో మాట్లాడారు. దేశీయంగా తయారు చేస్తున్న టీకా గురించిన వివరాలు తెలుసుకున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. ట్రయల్స్‌లో సాధించిన విజయాలపై శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. టీకా తయారీలో వేగాన్ని సంతరించుకోవడానికి భారత్ బయోటెక్ ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేస్తున్నదని వివరించారు. మధ్యాహ్నం 3.20గంటల సమయంలో పూణెకు బయల్దేరుతూ మెయిన్ గేట్ దగ్గర వాహనం దిగి మీడియాకు, ప్రజలకు అభివాదం చేశారు. పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలోపల కలియతిరుగుతూ టీకా తయారీ తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకు తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. టీకా అభివృద్ధితోపాటు దాని ఉత్పత్తి, పంపిణీపై వివరాలు, సమీక్షలు జరిపే లక్ష్యంతో ప్రధాని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారని అధికారులు తెలిపారు.