ఉద్యోగులకు షాక్.. PRC, ప్రమోషన్స్‌కు బ్రేకిచ్చిన ‘కోడ్’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ఇక కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లినట్లే. 32 నెలలు అధ్యయనం చేసిన నివేదిక.. 43 రోజుల పాటు సాగిన చర్చలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడో అప్పుడో అంటూ ఎదురుచూసిన ఉద్యోగుల ఆశలు గల్లంతయ్యాయి. ఫిట్మెంట్ ప్రధానంగా సాగదీసి.. పీఆర్సీ ప్రకటించే ఉద్దేశం లేదని ఇప్పటి వరకూ చెప్పుకుంటున్నట్టుగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రకటన వాయిదా పడింది. సర్కారు వ్యూహంలో జేఏసీ పావుగా మారిందని ఉద్యోగులు విమర్శిస్తుండగా.. ఉద్యోగ సంఘాల […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ఇక కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లినట్లే. 32 నెలలు అధ్యయనం చేసిన నివేదిక.. 43 రోజుల పాటు సాగిన చర్చలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడో అప్పుడో అంటూ ఎదురుచూసిన ఉద్యోగుల ఆశలు గల్లంతయ్యాయి. ఫిట్మెంట్ ప్రధానంగా సాగదీసి.. పీఆర్సీ ప్రకటించే ఉద్దేశం లేదని ఇప్పటి వరకూ చెప్పుకుంటున్నట్టుగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రకటన వాయిదా పడింది. సర్కారు వ్యూహంలో జేఏసీ పావుగా మారిందని ఉద్యోగులు విమర్శిస్తుండగా.. ఉద్యోగ సంఘాల కారణంగానే పీఆర్సీ ఆలస్యమైందని జేఏసీ ఎదురు జవాబిస్తోంది.
ఎప్పటికో మరి..?
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు, ప్రలోభపర్చే అంశాలకు బ్రేక్ పడింది. ఇన్ని రోజులు సాగదీత తర్వాత నేడో, రేపో ఫిట్మెంట్ ప్రకటన వస్తుందని భావించారు. కానీ ఊహించినట్టుగానే గురువారం షెడ్యూల్ విడుదలైంది. దీంతో పీఆర్సీ ఎప్పుడు వస్తుందనేది అనుమానంగా మారింది. ఎందుకంటే మార్చి 23 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లేనిపక్షంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు పలు పురపాలికలకు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే వార్డుల విభజనకు మార్గదర్శకాలిచ్చారు. దీంతో వరుస ఎన్నికలు వచ్చే పరిస్థితులున్నాయి. ఈ లెక్కన జూన్ వరకు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉండే అవకాశాలున్నాయి. అంటే జూన్ వరకు పీఆర్సీ ప్రకటన లేనట్టేనని ఉద్యోగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉద్యోగ వర్గాలు ఎటువైపో..?
ప్రస్తుతం ఎన్నికల్లో ఉద్యోగ వర్గాలు ఎటువైపు ఉంటాయనేది ప్రధాన చర్చగా మారింది. ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకున్నామని, కానీ ప్రకటించే సమయంలో కోడ్ వచ్చిందని, కోడ్ తర్వాత ఫిట్మెంట్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ లేదా మంత్రులతో సభల్లో, ప్రచారంలో చెప్పిస్తారని సమాచారం. ఇదే జరిగితే ఉద్యోగులు ఎంత మేరకు ప్రభుత్వానికి అనుకూలంగా మారుతారనేది అంచనా వేసుకుంటున్నారు. ఫిట్మెంట్ ఎక్కువగానే ఇస్తారనే ఆశల్లో ఉద్యోగులను పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తుందని, కానీ ఉద్యోగ వర్గాలు నమ్మే అవకాశాలు లేవని కూడా ప్రచారం జరుగుతోంది.
పోస్టింగ్‌లకు కూడా బ్రేక్..
ప్రస్తుతం ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు వచ్చినా సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే పలు విభాగాల్లో ప్రమోషన్లు ఇచ్చి కూడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. రేపో, మాపో పోస్టింగ్ వస్తుందంటూ ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆగిపోయినట్టే. ఎందుకంటే ఎన్నికల అవసరాల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌కు అవసరముంటేనే సీఈసీ అనుమతితో తాత్కాలిక బదిలీలు చేసుకోవాలి. అంతేకాని కొత్తగా బదిలీలు, పదోన్నతులు, పోస్టింగ్‌లు ఏవీ ఇవ్వకూడదు. దీంతో రాష్ట్రంలో వీటన్నింటికీ బ్రేక్ పడింది. అయితే వీటన్నింటి దృష్ట్యా రాష్ట్రంలో ఉద్యోగవర్గాలు ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను చూపిస్తారనే ప్రచారం జోరందుకుంది.