‘ప్రణబ్’తోనే తెలంగాణ కల సాకారం..
దిశ, న్యూస్ బ్యూరో: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రజలతో, ఉద్యమంతో, రాష్ట్రంతో, రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడక ముందు నుంచే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రణబ్ ముఖర్జీకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. యూపీఏ-1 హయాంలో సబ్ కమిటీ ఛైర్మన్‌గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో క్రియాశీల సభ్యుడిగా, చివరకు రాష్ట్రపతిగా ప్రతీ దశలో ఆయన తెలంగాణ పట్ల నిశ్చితాభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. CWCలో […]
దిశ, న్యూస్ బ్యూరో:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రజలతో, ఉద్యమంతో, రాష్ట్రంతో, రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం 2004లో ఏర్పడక ముందు నుంచే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రణబ్ ముఖర్జీకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. యూపీఏ-1 హయాంలో సబ్ కమిటీ ఛైర్మన్‌గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో క్రియాశీల సభ్యుడిగా, చివరకు రాష్ట్రపతిగా ప్రతీ దశలో ఆయన తెలంగాణ పట్ల నిశ్చితాభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. CWCలో నిర్ణయం మొదలు పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లుపై చర్చ జరిగి ఆమోదించడం వరకు ఆయనకు వివిధ రకాలుగా ప్రమేయం ఉంది. ప్రాథమిక స్థాయిలో బిల్లు రూపకల్పన ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. చివరికి ఆయన సంతకంతోనే రాష్ట్రం ఆవిర్భవించింది.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు..
యూపీఏ-1 ఉనికిలోకి రాక ముందు నుంచే తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పుట్టుకొచ్చిన టీఆర్ఎస్‌తో ఎలాంటి వైఖరి అవలంబించాలనేది ఏఐసీసీ స్థాయిలో కీలకంగా మారింది. అప్పటికీ 2004 ఎన్నికలు దగ్గరకొచ్చాయి. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలా? లేదా ? అనేది కీలకంగా మారింది. వైఎస్సార్ అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గట్టి పునాదిని, ప్రజాదరణను ఏర్పర్చుకున్నారు. ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడమా లేక ఏఐసీసీ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవడమా అనే చర్చ జరిగింది.
ఎట్టకేలకు పొత్తు..
చివరకు టీఆర్ఎస్‌తో పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించినట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎన్నికల ముందు ప్రణబ్ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ఆ తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాం (కనీస ఉమ్మడి ప్రణాళిక)లోనూ తెలంగాణ రాష్ట్రం హామీ చేరింది. దాని ప్రకారమే రాష్ట్ర ఏర్పాటుకు చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రణబ్ నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. రఘువంశ ప్రసాద్ సింగ్, దయానిధి మారన్ తదితరులు ఆ కమిటీలో ఉన్నారు. కానీ, నాలుగైదు కంటే ఎక్కువ మీటింగులు జరగలేదు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రణబ్ పాత్ర..
తీరా 2009 రానే వచ్చింది. వైఎస్సార్ చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. అప్పటికి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సబ్ కమిటీ ప్రక్రియ ఆశించిన విధంగా ముందుకు సాగలేదు. రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోడానికి కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణ నేతలంతా రాష్ట్ర సాధనకు పట్టుబడుతున్నారు. సీమాంధ్ర నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. ఎటూ తేల్చకోలేని పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే పేరుతో రెండేళ్లు గడిచిపోయాయి. ఉద్యమం చల్లార లేదు. చివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ప్రణబ్ ముఖర్జీ సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా బిల్లు రూపొందింది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యారు. బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత అది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లింది. ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన అనంతరం చట్టంగా రూపొందింది. ఆ తర్వాత పునర్ వ్యవస్థీకరణ చట్టానికి అనుబంధంగా అనేక సవరణలు కూడా తెరపైకి వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు, ముంపు గ్రామాల తరలింపు తదితర అంశాలకు కూడా సవరణలు రాష్ట్రపతి చేతుల మీదుగానే జరిగాయి.
కేసీఆర్‌కు ప్రశంసలు, సూచనలు..
రాష్ట్ర సాధన కోసం జరిపిన ఉద్యమంలో రాజకీయ పాత్ర పోషించిన కేసీఆర్ చివరకు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం పట్ల ప్రణబ్ సంతోషం వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలన అందించాలని కేసీఆర్‌కు సూచించారు. రాష్ట్రపతిగా శీతాకాల విడిది కోసం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంకు వచ్చిన ప్రతీసారి రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజలకు అందుతున్న ఫలాల గురించి, పరిపాలన గురించి కేసీఆర్‌తో చర్చించేవారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్‌కు పలు సందర్భాల్లో సూచించేవారు. స్వయంగా కేసీఆర్ ఈ విషయాన్ని సందర్భానుసారం ప్రస్తావించేవారు. రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ సైతం ఈ జ్ఞాపకాలను ‘దిశ’తో పంచుకున్నారు.
‘జై తెలంగాణ’తో వీడ్కోలు..
రాష్ట్రపతిగా 2017లో పదవీ విరమణ సందర్భంగా పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతి భవన్ సేకరించింది. ఆ సమయంలో టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేతగా ఉన్న జితేందర్ రెడ్డి ఆ రిజిస్టర్‌లో ‘జై తెలంగాణ’ అని పేర్కొన్నారు. దీనికి లోక్‌సభ సెక్రటరీ జనరల్, రాష్ట్రపతి భవన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగడుగునా సహకారం అందించారని, చివరకు ఆయన చేతుల మీదుగానే రాష్ట్రం ఆవిర్భవించిందని, ఆ అనుబంధాన్ని మర్చిపోలేమని జితేందర్ రెడ్డి అర్థం చేయించి ఒప్పించారు.