సింగిల్ డిజిట్‌కి పడిపోయిన పాజిటివ్ కేసులు..

పది రోజుల తర్వాత రాష్ట్రానికి ఉపశమనం దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో కేవలం ఏడు కొత్త కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఆరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, ఒకటి వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసు వేలేరు మండలం, ఎర్రబెల్లి తండాకు […]

Update: 2020-04-25 10:30 GMT

పది రోజుల తర్వాత రాష్ట్రానికి ఉపశమనం

దిశ, న్యూస్ బ్యూరో:

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో కేవలం ఏడు కొత్త కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఆరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా, ఒకటి వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసు వేలేరు మండలం, ఎర్రబెల్లి తండాకు చెందిన 13 ఏళ్ళ బాలుడిది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన పది రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 15వ తేదీన మాత్రమే ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి రోజు నుంచి 50, 66, 43, 49, 14, 56, 15, 27, 13 చొప్పున ప్రతీరోజూ నమోదయ్యాయి. మళ్ళీ పది రోజుల తర్వాత సింగిల్ డిజిట్‌లో కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకుంటున్న చర్యల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన ఒక్క రోజు వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కి పడిపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 990కు చేరుకుంది. ఇందులో 307 మంది డిశ్చార్జి కావడం, పాతిక మంది చనిపోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 658కి చేరుకుంది. ఈ నెల చివరికల్లా కొత్త కేసులేవీ నమోదు కాకపోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల కిందట మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు అనుగుణంగానే బులెటిన్‌లో అంకెలు ఉంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మే 5వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకేనే అవకాశం ఉంది.

Tags: Telangana, Corona, Positive Cases, Single Digit, GHMC

Tags:    

Similar News