YS Sharmila: న్యాయ రాజధాని అంటే ఇదేనా..? అన్నపై చెల్లి ఫైర్..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో అన్నాచెల్లెళ్ళ పోరు రసవత్తరంగా మారింది.

Update: 2024-04-21 10:04 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల నేపథ్యంలో అన్నాచెల్లెళ్ళ పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో అన్న గెలుపు కోసం పోరాడిన వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో అన్నపైనే గెలుపు కోసం పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న కడప ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కాగా ఈ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ జగన్‌పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలును స్మార్ట్‌ సిటీగా చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం నేడు కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు.  గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవని.. అది కూడా చెయ్యడం చేతకాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.

ఏటా జనవరికి జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పిన జగన్ ఇచ్చిన మాట నిలుపుకున్నారా..? అంటే.. అదీ లేదని.. నేడు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్‌తో పాటు అన్నింటి ఛార్జీలు పెంచి.. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని.. చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారా..? అని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. దేనికి సిద్ధం..? ప్రత్యేక హోదా అని మోసం చేసేందుకు సిద్ధమా? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడానికా?.. దేనికి సిద్ధం? అని షర్మిల ఘాటుగా ప్రశ్నించారు.

Tags:    

Similar News