AP News: అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా వైసీపీ నేతలు.. కేస్ స్టడీగా విశాఖ

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయి రెడ్డి భూ కబ్జా తెలివితేటలకు కేంద్ర దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీ.. షాక్‌కు గురయ్యాయి.

Update: 2024-07-04 02:13 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయి రెడ్డి భూ కబ్జా తెలివితేటలకు కేంద్ర దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఈడీ.. షాక్‌కు గురయ్యాయి. వేల కోట్ల విలువైన విశాఖ ఎన్‌సీ‌సీ‌కి చెందిన భూములను వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు జీవోలు, నివేదికలు, అనుమతులతో సూట్ కేస్ కంపెనీలకు బదిలీ చేసిన తీరు దర్యాప్తు సంస్థల అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ తరహా మోసాలు కూడా వుంటాయా? అని తొలుత ఆశ్చర్యపోయిన వారు దీనిని ఒక కేస్ స్టడీగా తీసుకొని దర్యాప్తు చేయాలని రంగంలోకి దిగినట్లు తెలిసింది. గతంలో షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి ఈ భూములపై విచారణను తన అధికార పలుకుబడితో అడ్డుకొన్నారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

ఎన్‌సీ‌సీ‌కి నోటీసులు

ఈ భూముల వ్యవహారానికి సంబంధించి వివరాలతో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఇప్పటికే నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌సీ‌సీ‌) సంస్థ బాధ్యులకు వారం రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. కంపెనీ బాధ్యుడైన రంగరాజు అందుబాటులో లేరంటూ నోటీసులను కంపెనీ ప్రతినిధులు తిరస్కరించారని తెలియవచ్చింది. దీంతో పాటు సూట్ కేస్ కంపెనీలను సృష్టించి భూములు కాజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు, జీపీఆర్ఎల్ కంపెనీ అధినేత కొట్టు మురళీకి నోటీసులు జారీ అయ్యాయి.

ఎన్‌సీ‌సీ డైరెక్టర్లు అందుబాటులో లేకుండా పోగా, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కొట్టు మురళీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు సీబీఐతోపాటు ఆర్థిక లావాదేవాలకు సంబంధించి విచారణ జరిపే ఈడీ కూడా రంగంలోకి దిగనుంది. ఈ భూముల ఆధారంగా పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.

రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై దృష్టి..

ఈ భూములకు సంబంధించి జరిగిన రిజిస్ర్టేషన్లలో భూమి విలువను బాగా తగ్గించి చూపించి స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టారు. రాష్ర్ట ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్ ఫీజుల క్రింద ఈ 90 ఎకరాల భూ హక్కుల బదిలీకి సుమారు రూ.280 కోట్ల స్టాంప్ డ్యూటీ రావాల్సివుండగా భూమి విలువ బాగా తగ్గించి చూపించడంతో కేవలం 14 కోట్ల రూపాయల ఆదాయమే వచ్చింది. దీని వెనుక విజయసాయిరెడ్డితో పాటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వర రెడ్డి (కేఎన్‌ఆర్ ) తదితరులు వున్నారని తెలిసింది.

వీరి సిఫార్సు మేరకు రాత్రికి రాత్రి గజం రూ.50 వేలకు పైగా రిజిస్ర్టేషన్ విలువ వున్న మధురవాడలో దానిని బాగా తగ్గించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందుకు తప్పుడు సమాచారంతో సహకరించిన, ప్రభుత్వాన్ని మోసగించిన అధికారులను గుర్తించే పనిని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. పలు సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్ల మోసాలకు పాల్పడిన సింగపూర్ రమణారెడ్డి పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలు కేసులు, లుక్ అవుట్ నోటీసులు పెండింగ్‌లో వున్నందున ఈ ఆర్థిక నేరగాడి ఆటకట్టించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.

భూ కేటాయింపుల రద్దుపై కసరత్తు..

పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగిన ఎన్సీసీ భూ కేటాయింపులను రద్దు చేసే అవకాశాలను రాష్ర్ట ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విశాఖ ఐటీ పార్క్‌కు ఆనుకొని అత్యంత విలువైన ఈ భూములు వుండడంతో భవిష్యత్‌లో ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరమౌతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుంభకోణాలకు కారణమైన ఈ కేటాయింపులను రద్దు చేసి ఐటీ పరిశ్రమలకు భూములను కేటాయిస్తే వేల మందికి ఉపాధి అవకాశాలు లభించి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయి.


Similar News