AP Politics: టీడీపీ గూటికి వైసీపీ కీలక నేత

రాజకీయాల్లో రాణించాలంటే అదృష్టంతో పాటు స్థిరత్వం, పార్టీ పట్ల నమ్మకం, నాయకునిపై విశ్వాసం కలిగి ఉండాలి.

Update: 2024-06-20 03:36 GMT

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: రాజకీయాల్లో రాణించాలంటే అదృష్టంతో పాటు స్థిరత్వం, పార్టీ పట్ల నమ్మకం, నాయకునిపై విశ్వాసం కలిగి ఉండాలి. నిత్యం పార్టీలు మారటం ద్వారా రాజకీయాల్లో నష్టపోయిన వారిలో ప్రధానమైన వ్యక్తి చలమలశెట్టి సునీల్‌ను ప్రత్యేకంగా చెప్పవచ్చు. అర్థికంగా స్థితిమంతుడు, వ్యాపారాలతో పాటు పారిశ్రామికవేత్త కావటంతో ఏ పార్టీలోనైనా అయనకు టికెట్ ఖాయం.

పట్టు వదలని విక్రమార్కుడులా 2009 నుండి ప్రతి ఎన్నికలలోను పోటీ చేయటం, ఓడిపోవటం అయనకు రివాజే. అయితే మరొక ముఖ్య లక్షణమేమిటంటే పార్టీలు మారినా ఆయన పోటీ చేసేది కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగానే. 2009 నుంచి ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ పోటీ చేసిన ప్రతిసారీ ఆయన ఓడిపోతూనే ఉన్నారు. ఓటమి చెందినప్పుడల్లా పార్టీ మారి అధికార పార్టీలోకి వస్తారు. విచిత్రమేమిటంటే సునీల్ వీడిన పార్టీ అధికారంలోకి వచ్చేది.

వైసీపీనీ వీడే అవకాశం

ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలే అలోచనలో భాగంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నాయకులతో ఉన్న పరిచయాల దృష్ట్యా వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అటువంటి వారికి అవకాశం కల్పించవద్దనే వాదన వినిపిస్తోంది. వైసీపీ తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి కూటమి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేతిలో ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ టీడీపీలోకి వచ్చేందుకు దారులు వెదుకుతున్నారు.ఈ మేరకు ఆయన టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా కబురు పెట్టారు. అత్యంత ముఖ్య నాయకుడి ద్వారా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారం పంపినట్టు సమాచారం.

2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా..

2009 లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్‌‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.ఎం.పల్లంరాజు గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి వంగా గీత విజేతగా నిలవగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సునీల్‌‌కు ఓటమే ఎదురైంది.

తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ చేతిలో నాలుగోసారి పరాజయం తప్పలేదు. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీలోకి వెళ్లి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనంతో భారీ మెజార్టీతో గెలుస్తానని స్థానిక అజెండాతో రూ.వందల కోట్ల విలువైన హామీలతో జనం ముందుకెళ్లినా పరాభవం తప్పలేదు. ఆర్థిక మూలాలు ఉన్న చలమలశెట్టి సునీల్‌కు టీడీపీ నాయకత్వంతో గాని, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో గాని ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవితోను ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈ మేరకు తనకున్న పరిచయాలతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వలసలపై కూటమి నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందోనన్నదే ప్రశ్న.


Similar News