AP Politics: ఉక్కిరి బిక్కిరి అవుతున్న విశాఖ వైసీపీ నేతలు..
రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాకముందే విశాఖలో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాకముందే విశాఖలో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నోటీసులు, అరెస్టు భయాలు, ఆస్తుల భయాలతో వణికిపోతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం మారడం తమపై ఫిర్యాదులకు అధికారులు స్పందిస్తుండడంతో ఏ నిముషంలో ఏమౌతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. వైసీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ అయ్యాయి.
అమర్నాధ్ వాణిజ్య భవనానికి నోటీసు
మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ గాజువాకలో అసలు జీవీఎంసీ అనుమతులే లేకుండా కట్టేసిన వాణిజ్య సముదాయానికి నోటీసులు వెళ్లాయి. ఈ భవన నిర్మాణంలో పలు ఉల్లంఘనలు వుండడంతో కూల్చివేత తప్పదనే నిర్ణయానికి అమర్నాధ్ వచ్చేసినట్లు తెలిసింది. తమ పాలనా కాలంలో తాము చూపిన దుందుడుకు, కక్షపూరిత వైఖరే ఇప్పుడు వెంటాడుతోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారని తెలిసింది.
ఎంవీవీ, జీవీలకు అరెస్టు భయం
ఇక మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సహచరుడు జీవీల పరిస్థితి అయితే మరీ దయనీయం. సీబీసీఎన్‌సీ క్రైస్తవ భూమిలో ఎంవీవీ చేస్తున్న నిర్మాణ పనులకు స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా జీవీఎంసీ బ్రేకులు వేసింది. ఎంవీవీ, జీవీలు విజయసాయిరెడ్డి మద్దతుతో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన హయిగ్రీవ ప్రాజెక్టుపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులే నమోదు కావడంతో వారిద్దరూ ఇప్పుడూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసి అరెస్టు తప్పించుకునేందుకు సెల్ ఫోన్‌లు కట్టేసుకొని పరారయ్యారు.
ఆత్మహత్యాయత్నం చేసిన అదీప్ రాజు
అధికారంలో వుండగా పెద్ద ఎత్తున వేధింపులకు, దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అయితే వీటినుంచి బయట పడేందుకు ఆత్మహత్యాయత్నం డ్రామాకే తెరలేపారు. వివాహితతో సంబంధాలు, పలు పనులు, పైరవీలు పేరిట పలువురు నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసిన డబ్బు తిరిగి చెల్లించాలంటూ వస్తున్న ఒత్తిడి వంటి వాటికారణంగా నాలుగంటే నాలుగే నిద్రమాత్రలు మింగి ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయిన శాసనసభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది.
ప్రశాంత విశాఖలో విజయసాయి చిచ్చు
అసలు రాజకీయ కక్షలకు, సాధింపులకు ఇప్పటి వరకూ అవకాశమే లేని ప్రశాంత విశాఖలో, ఉత్తరాంధ్రాలో ఈ మార్పుకు కారణం రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్రా వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన పి.విజయసాయి రెడ్డి అంటూ ఆ పార్టీనేతలే మండిపడుతున్నారు. రాష్ర్టంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా విశాఖలో ప్రతిపక్ష నేతలపై ఈ రేంజ్‌లో ఎప్పుడూ వేధింపులు లేవు.
ఈ ప్రాంతంతో సంబంధంలేని, ఇక్కడి నేతల మనోభావాలను పట్టించుకోకుండా కేవలం తన స్వార్థం కోసం వేధింపు రాజకీయాలు చేసిన ఆయన కారణంగా ఇఫ్పుడు ఇక్కడి నేతలు ఇబ్బందులు పడుతున్నారు. విజయసాయి నేతృత్వంలో గీతం విశ్వవిద్యాయలం గోడలు కూల్చారు. సబ్బం హరి ఇంటి గోడలు, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి గోడలు, పల్లా శ్రీనివాస్ వాణిజ్య సముదాయం కూల్చారు. ఇప్పుడు ఈ చర్యలకు రివెంజ్ ఆరంభమైంది. విశాఖలో వుండే వైసీపీ నేతలు దీంతో ఇబ్బందులు పడుతుండగా విజయసాయి ఇక్కడినుంచి చాపచుట్టేసి ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు.