కేసీఆర్ జాతీయ పార్టీ ఎఫెక్ట్: ఏపీలో కీలకంగా మారనున్న జగన్ కుటుంబసభ్యుడు?
సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించేందుకు గులాబీ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించేందుకు గులాబీ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవల్ నుండి స్టేట్ ఆఫీస్ వరకు జాతీయ పార్టీ ప్రకటన వెలువడగానే అంబరాన్ని అంటేలా సంబురాలు జరుపుకోవాలని సిద్ధం అవుతున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ పార్టీకి అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. పొరుగు రాష్ట్రం ఏపీలో సదరు ఎమ్మెల్సీ చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఓ వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని మద్దతు కూడగడుతుంటే జగన్ను కాదని ఆ సామాజిక వర్గం కేసీఆర్‌కు జై కొడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ జాతీయ పార్టీకి సీవైఎఫ్ మద్దతు:
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సీవైఎఫ్ సమావేశంలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఆర్గనేజేషన్ సీఎం కేసీఆర్ పెట్టబోయే కొత్త పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నట్లు తీర్మానం చేసింది. కేసీఆర్‌కు మద్దతుగా చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావుకు అందజేశారు. ఈ పత్రాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సభ్యులు కోరారు. అయితే జగన్‌కు గత ఎన్నికల్లో క్రిస్టియన్, మైనార్టీ వర్గాల నుంచి మంచి మద్దతు లభించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ వర్గాల ఓట్లు జగన్ కే పడ్డాయని ఇలా వారి మద్దతు వెనుక జగన్ బావ బ్రదర్ అనిల్ కూమార్ చక్రం తిప్పారనే ప్రచారం ఉంది. కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి మీ అందరికీ నేనున్నానంటూ వారి ఓట్లను వైసీపీ వైపు మళ్లించారనే టాక్ ఉంది. అయితే ఇటీవల బ్రదర్ అనిల్ యూటర్న్ తీసుకున్నారు. చాలారోజుల తర్వాత ఏపీ రాజకీయాలపై స్పందించిన ఆయన పలువురు కుల సంఘాలతో భేటీ అయి జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
బ్రదర్ అనిల్ ఎవరివైపు?:
ఏపీ సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ అనూహ్యంగా గత మార్చిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందని, వాళ్లంతా కలిసి పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు. వారికి అండగా ఉంటానని బ్రదర్ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. అనిల్ తన బావమరిది జగన్‌ను టార్గెట్ చేశారా అనే విశ్లేషణలు వినిపించాయి. ఆయనే సొంతంగా ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు రాగా అంది అంత సింపుల్‌గా జరిగిపోయే పని కాదని అలాంటి ఆలోచన ఉంటే చెప్తానంటూ పార్టీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ ఎపిసోడ్‌లో బ్రదర్ అనిల్ కుమార్ జగన్‌పై గుర్రుగా ఉన్నట్లు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ విషయంలో బ్రదర్ అనిల్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాబోయే ఎన్నికల్లో జగన్ వైపే ఉంటారా? లేక తెలంగాణలో తన భార్య షర్మిల పార్టీ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీ వైపు మళ్లుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఏపీతో పాటు తెలంగాణలోని క్రిస్టియన్ సంఘాల పెద్దలకు బ్రదర్ అనిల్ కుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఏపీని విభజనకు కారణం అయ్యాడనే విమర్శలు ఉన్న కేసీఆర్‌కు ఎన్నికల సమయానికి వీరంతా మద్దతు ప్రకటిస్తారా? లేక కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతారా అనేది మరో అంశం.
ఇవి కూడా చదవండి : రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం దానిపైనే.. జై రామ్ రమేష్