మరింత ‘క్రూరం’గా దేశద్రోహ చట్టం.. విపక్షాలపై ప్రయోగించే కుట్ర: కాంగ్రెస్

దేశద్రోహ చట్టాన్ని మరింత ‘క్రూరం’గా మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

Update: 2023-06-03 14:45 GMT

న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టాన్ని మరింత ‘క్రూరం’గా మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీన్ని ప్రతిపక్ష నాయకులపై ఏకపక్షంగా ప్రయోగిస్తామని బెదిరించేందుకే సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘అసమ్మతిని అణిచివేయడం, తమతో విభేదించే వారిని లొంగదీసుకోవడం, నోళ్లు మూయడం’ వంటి చర్యల కోసం దేశద్రోహ చట్టాన్ని వాడుకోవాలని మోడీ సర్కారు భావిస్తోందన్నారు. దేశద్రోహ చట్టానికి లా కమిషన్ మద్దతు ఇవ్వడం కేంద్రం కుట్రలో భాగమే అన్నారు. దేశద్రోహ చట్టాన్ని పనికిరానిదంటూ సుప్రీం కోర్టు పక్కన పెట్టినప్పటికీ దాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఎందుకు ఇష్టపడటం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. పాలకులకు, పాలితులకు మధ్య దూరం ఉంటుందని, దేశద్రోహ చట్టం ద్వారా ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా ఉండదని, గణతంత్ర పునాదులు పెకిలించబడతాయని హెచ్చరించారు. దేశద్రోహ నేరానికి సంబంధించిన 124ఏ సెక్షన్ కింద జైలు శిక్షను కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని లా కమిషన్ సిఫారసు చేసిందని, దీంతో న్యాయస్థానాలు శిక్షను ఎక్కువ కాలం విధించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ పాలనలో పెరిగిన దేశద్రోహ కేసులు

వలస పాలన కంటే మరింత క్రూరమైన, కఠినమైన, ఘోరమైన చట్టం తేవాలని బీజేపీ సర్కారు కుట్ర పన్నుతోందని సింఘ్వీ ఆరోపించారు. 2010-2014 మధ్య కాలంతో పోలిస్తే 2014-2020 మధ్య కాలంలో దేశద్రోహ కేసులు 28% పెరిగాయని, కొవిడ్ మహమ్మారి సమయంలో వెంటిలేటర్ల కొరత, ఆహారం పంపిణీ, వలస కార్మికుల సమస్యలపై ఆందోళన చేసిన వారిపైనా 12 దేశద్రోహ కేసులు పెట్టడం దీని దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. జర్నలిస్టులపై 21 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని.. అదికూడా 2018 నుంచి వ్యవసాయ చట్టాలు, కొవిడ్, హత్రాస్ గ్యాంగ్ రేప్, పీఆర్సీ తదితర నిర్ణయాలపై ప్రభుత్వాన్ని విమర్శించినందుకే ఈ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. పీఆర్సీ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై 27 దేశద్రోహ కేసులు నమోదు చేశారని, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన రైతులపైనా 8 కేసులు నమోదయ్యాయని సింఘ్వీ గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, పలువురు సీనియర్ జర్నలిస్టులపైనా దేశద్రోహ కేసులు పెట్టడం విశేషమన్నారు. ప్రతిపక్ష నేతలు, అసమ్మతివాదులపైనే దేశద్రోహం కేసులు పెట్టారని, బీజేపీ నేతలపై ఎందుకు పెట్టలేదని సింఘ్వీ ప్రశ్నించారు.

Tags:    

Similar News