కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని జగన్ కుర్రాడట.. నారా లోకేశ్ సెటైర్లు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో : కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకి వెళ్లిన సీఎం జగన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టటానికి వంగలేకపోయాడని, మళ్లీ తాను కుర్రాడిని-చంద్రబాబు ముసలాడు అంటాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రని అడ్డుకోవాలని పోలీసుల్ని పంపిన బడాచోర్ ఎమ్మెల్యేకి దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23వ రోజు మంగళవారం లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. 300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న తొండమానుపురంలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించారు. తొండ మానుపురంలో 300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యింది. ఇక్కడి ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో తాగునీటి పథకం పూర్తి చేసి ఇంటింటికీ కొళాయి వేసి ఉచితంగా నీరు అందిస్తాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మైక్ పట్టుకుని మాట్లాడొద్దని జీవో1లో ఉంది. నా చేతిలో మైకు లేదు..ఎందుకు భయపడుతున్నారు. స్టూలు పట్టుకుపోతే మరో స్టూలు పట్టుకొస్తాం. ఎన్ని అడ్డంకులు కల్పించినా తగ్గేదే లేదు అని లోకేశ్ హెచ్చరించారు.
కేసులకు భయపడను
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి అని లోకేశ్ ఆరోపించారు. అందరి తరపున పోరాడుతున్నందుకే తన గొంతు నొక్కుతున్నారు. భయం తన బయోడేటాలో లేదు అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 21 కేసులు పెట్టారు. అయినా తగ్గేదేలే అని చెప్పుకొచ్చారు. అనపర్తిలో చంద్రబాబు సభకి అనుమతి ఇచ్చి మళ్లీ రద్దుచేసి చీకట్లో 7 కిలోమీటర్లు నడిపించారు. జగన్ పతనం మొదలు అయ్యింది..జగన్ పని అయిపోయింది.. అందుకే గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎంత సతాయిస్తే అంత మాట్లాడతా. సాఫీగా సాగనిస్తే పాదయాత్ర- అడ్డుకుంటే దండయాత్ర అని లోకేశ్ హెచ్చరించారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి వెళ్లి వంగి కొబ్బరి కాయ కొట్టలేని జగన్ తాను కుర్రాడినంటాడు. 72 ఏళ్ల వయస్సులో 27 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెట్టే చంద్రబాబుని ముసలాడు అంటాడు అని ఎద్దేవా చేశారు.
బాబాయ్‌ని చంపినోడు సైకో కాదా..?
జీవో 1లో మైకు వాడొద్దన్నారు.. నేను వాడట్లేదు. అడ్డుకుంటానంటే ఊరుకునేది లేదు అని లోకేశ్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక జీవో1ని తాము వ్యతిరేకించినా చట్టాలని గౌరవిస్తాం. శాంతియుతంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం. అడ్డుకోవాలని చూస్తున్నారు. మా హక్కులనీ వదులుకోం. నన్ను అడ్డుకోవాలని పంపిన ఆ బడాచోర్ ఎమ్మెల్యేకి దమ్ముంటే రమ్మను ఎస్ఐ అని లోకేశ్ సవాల్ విసిరారు. సొంత బాబాయ్‌ని చంపినోడు సైకో. తల్లి చెల్లిని తరిమేసినోడు సైకో. ప్రజల్ని వేధించేవాడు సైకో. అందుకే సైకో పోవాలి.. సైకిల్ రావాలి అని లోకేశ్ గట్టిగా నినదించారు.
Also Read..
బ్రేకింగ్: రన్నింగ్‌లోనే ఊడిపోయిన డీజిల్ ట్యాంక్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం